హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): ‘ఎస్సీ గురుకుల సొసైటీలో లేడీబాస్’ పేరిట ఇటీవల ‘నమస్తే తెలంగాణ పత్రిక’లో ప్రచురితమైన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. నగరం పరిధిలోని ఓ దివ్యాంగ హాస్టల్ వార్డెన్‌ను తొలుత ఎస్సీ అభివృద్ధిశాఖకు సంబంధించిన మంత్రి పేషీలో, ఆ తరువాత అక్కడి నుంచి మళ్లీ ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ప్రభుత్వం నియమించింది. సొసైటీ జాయింట్ సెక్రటరీతో సమానంగా ప్రత్యేక గదిని సైతం కేటాయించింది.
అమాత్యుడి ప్రత్యేక చొరవతోనే ఈ వ్యవహారం కొనసాగుతున్నదని సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. సదరు మహిళా అధికారిణి సొసైటీలో పెత్తనం చెలాయిస్తున్నారని, ఇదేమని అడిగితే మంత్రికే ఫిర్యాదు చేస్తూ చీవాట్లు పెట్టిస్తున్నారని వాపోతున్నాయి. ఈ తతంగంపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలతోపాటు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.