హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఒకవైపు దివ్యాంగుల హాస్టళ్లలో వార్డెన్లు లేరు. ఒక్కొక్కరికీ రెండేసి, మూడేసి హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించి నెట్టుకొస్తున్నారు. అయినప్పటికీ, అక్కడున్న ఓ వార్డెన్‌ను అందులోనూ మాతృశాఖ కానీ ఎస్సీ గురుకుల సొసైటీకి, అదీ ప్రొబేషనరీ పీరియడ్ పూర్తికాకుండానే డిప్యుటేషన్‌పై పంపించారు. అమాత్యుడి ప్రత్యేక చొరవే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఆమెకు ఉన్నతాధికారులతో సమానంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడమేకాదు.. మేడమ్‌ను పల్లెత్తు మాటన్నా మంత్రిగారికి ఫిర్యాదులు చేరడం, సంబంధిత అధికారులకు చీవాట్లు పరిపాటిగా మారింది.
ఈ వ్యవహారం ఇప్పుడు సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి పద్ధతంటూ అమాత్యుడిపై మండిపడుతున్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో దాదాపు 11 హాస్టల్స్ ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ప్రస్తుతం ఆరుగురు మాత్రమే రెగ్యులర్ వార్డెన్లు ఉన్నారు. దీంతో చాలాచోట్ల ఒక్కరికే రెండేసి హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒకరిని ఇటీవల డిప్యుటేషన్‌పై పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అదీ నిబంధనలకు విరుద్ధంగా ప్రొబేషనరీ పీరియడ్ కూడా పూర్తికాకుండా, మాతృసంస్థ కాకుండా మరో శాఖకు పంపడమే విమర్శలకు తావిస్తున్నది. సాధారణంగా ఉద్యోగి విధుల్లో చేరిన అనంతరం రెండేండ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సర్వీస్ రెగ్యులరైజేషన్ పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)కి అర్హులు. అది కూడా అనారోగ్య కారణాలు, స్పౌజ్ తదితర ముఖ్యమైన కారణాల రీత్యానే. కానీ, ఆ నిబంధనలన్నీ తుంగలో తొక్కి మహిళా వార్డెన్‌కు డిప్యుటేషన్ ఇవ్వడం ప్రభుత్వం ఇష్టారీతి నిర్ణయాలకు అద్దంపడుతున్నది.
తొలుత మంత్రి పేషీకి.. ఆపై సొసైటీ హెడ్ ఆఫీస్‌కు..
దివ్యాంగ విద్యార్థుల ఆలనను పక్కకునెట్టి అమాత్యుడే సదరు వార్డెన్‌ను నాలుగు నెలల క్రితం తన పేషీలో కూర్చోబెట్టారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పేషీలో సెక్షన్ ఆఫీసర్‌గా డిప్యుటేషన్‌పై నియమించారు. ఆమె నియామకం, వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అమాత్యుడు సదరు అధికారిణిని పేషీ నుంచి తప్పించి, ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో నియమించారు. ఇక్కడా పేషీలోని పరిస్థితే నెలకొన్నది. ‘నా వెనుక మంత్రి ఉన్నారు. నా జోలికి రావొద్దు. ఏదైనా చేస్తే మంత్రికి చెప్పి మీ సంగతి చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని పలువురు ఉన్నతాధికారులే వాపోతున్నారు.
తనకు ప్రత్యేకంగా గది కేటాయించాలని సదరు వార్డెన్ డిమాండ్ చేయడం, రూల్ పోజిషన్ ఒప్పుకోబోదని పలువురు ఉన్నతాధికారులు తిరస్కరించడం, విషయాన్ని నేరుగా మంత్రికి ఫిర్యాదు చేయడం, ఆపై నిమిషాల్లో జాయింట్ సెక్రటరీతో సమానంగా సదరు మహిళా వార్డెన్‌కు హెడ్ ఆఫీస్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేయడం గమనార్హం. సదరు మహిళా వార్డెన్ సొసైటీ పరిపాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకొంటున్నారని, పైరవీలతోపాటు, మంత్రికి సంబంధించిన ప్రతి ఫైలునూ పంపాలని ఆదేశిస్తున్నారని అడ్మిన్ సెక్షన్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అవసరమైతే విచారణకు ఆదేశించాలని సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విధులు కొనసాగిస్తున్న సదరు ఉద్యోగిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.