హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టును నిర్మించవద్దని ‘ఆలోచనాపరుల వేదిక’లో మేధావులు డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అకినేని భవానీప్రసాద్, టీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు చేపడతున్నారని ఆరోపించారు. కేంద్ర జలసంఘం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తెచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఏపీ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. దీనివల్ల కృష్ణానది నుంచి 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోతుందని చెప్పారు. అలాగే, రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పుడు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులు కోల్పోతామని వివరించారు.
ఇప్పుడున్న పట్టిసీమ కాల్వను పెద్దది చేసి అందులో 38,000 క్యూసెకుల నీటిని నింపినా, లేదంటే ఇంకో సమాంతర కాల్వను నిర్మించి 23,000 క్యూసెకులు పంపినా.. కృష్ణా నది ప్రకాశం బరాజ్ దగ్గర నిండుగా ప్రవహించినప్పుడల్లా విజయవాడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బనకచర్ల వల్ల రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఏదీ లేదని, ఇప్పుడు చెప్తున్న లెకల ప్రకారం నిర్వహణ వ్యయమే సంవత్సరానికి ఎకరాకు రూ.50,000 అవుతుందని, దీనికి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, దానిమీద వడ్డీలు కలిపితే రూ.లక్ష దాటిపోతుందని వివరించారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఒక్కటేనన్న భావన ప్రజల్లో ఉన్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏపీకి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.