Bhatti Vikramarka | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఈ సంవత్సరం 5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దసరాకు ముందురోజు నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా విద్యపై దృష్టి పెడతామని చెప్పారు. 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లను నిర్మించి ఇక్కడ 12వ తరగతి వరకు విద్యార్థులకు బోధిస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని భట్టి ఆదివారం సచివాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మిస్తామని, ఇప్పటివరకు 25 నియోజకవర్గాల నుంచి స్థలాలను సేకరించి పైలట్ ప్రాజెక్టు కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,023 రెసిడెన్షియల్ పాఠశాలు, ఉండగా ఇందులో 662 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. అన్నివర్గాల విద్యార్థులు కలిసి ఒకచోట ఓ కుటుంబంలా చదువుకొనేలా స్కూళ్ల భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.