హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఓ సమగ్ర చట్టాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఇచ్చి మార్గదర్శకాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ నేతృత్వంలో జలసౌధలో మంగళవారం ఉన్నతస్థాయి సమీ క్ష సమావేశం జరిగింది. త్వరలోనే క్షేత్రస్థాయి అధికారులతో కలిసి వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయాలని సమాలోచనలు జరుపుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నీటి పారుదలశాఖకు సం బంధించి నాలుగు చట్టాలు ఉన్నాయి. నీటిపారుదల పనులు-నిర్వహణ, జల వనరుల నియంత్రణ, వరద నియంత్రణ-నివారణ చర్యలు, ఆస్తులు, తైబందీ తదితర అంశాలపై వేర్వేరు చట్టాలను రూపొందించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో నీటిపారుదల ముఖచిత్రం మారిపోయింది. ఓ వైపు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుండగా, మేజర్, మీడియం, మైనర్ నీటి వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చాయి.
ఈ మార్పులకు అనుగుణంగా సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్‌తో పాటు పలురాష్ర్టాలు రూపొందించుకున్న సమీకృత ఇరిగేషన్ చట్టాలను అధ్యయనం చేస్తున్నారు. జలసౌధలో జరిగిన సమీక్షలో రజత్‌కుమార్ కొత్త చట్టంపై ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లతో సమాలోచనలు జరిపారు. చట్టంలో పొందుపరచాల్సిన నిబంధనలు, చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అతిత్వరలోనే ఇదే అంశంపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్‌కుమార్, నాగేంద్రరావు, శంకర్, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.