Inspire | హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహించే ఇన్స్పైర్ మానక్ పట్ల రాష్ట్రంలోని పాఠశాలలు ఆసక్తిచూపడంలేదు. నారాయణపేట, ఆదిలాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి, జయశంకర్భూపాలపల్లి, నిర్మల్, మెదక్ జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్క దరఖాస్తూ రాలేదు. రాష్ట్రంలో 12,954 పాఠశాలలున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి 64,770 నామినేషన్లను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,451 మాత్రమే వచ్చాయి. 2024-25 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ దరఖాస్తుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 15తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీఈఆర్టీ అధికారులు కోరారు. ఇప్పటి వరకు మహబూబాబాద్ నుంచి 395, నల్లగొండ నుంచి 173, నాగర్‌కర్నూల్ నుంచి 118 మాత్రమే ఎంట్రీలు వచ్చాయి. మిగిలిన 30 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి వంద ఎంట్రీలు కూడా రాలేదు. జనగాం 5, పెద్దపల్లి 6, కామారెడ్డి 8, జోగులాంబ గద్వాల నుంచి 10 చొప్పున మాత్రమే దరఖాస్తులొచ్చాయి.
విద్యార్ధి దశలోనే పరిశోధనాకాంక్షను పెంపొందించేందుకు ఇన్‌స్పైర్‌ను విద్యాశాఖ అమలుచేస్తున్నది. మాడ్యూల్స్‌ను రూపొందించడం వరకే పరిమితం కాకుండా.. ప్రాజెక్ట్‌లకు వాస్తవిక రూపాన్నిచ్చి స్టార్టప్‌లుగా రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యార్థుల ఆలోచనలకు పదునుపెట్టేందుకు ఐఐటీ, ఎన్ఐటీ, ఐసర్ సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ఇన్స్పైర్ జిల్లాస్థాయిలో ఎంపికైతే రూ.10వేలు, జాతీయస్థాయికి ఎంపికైతే రూ.20వేల చొప్పున ప్రోత్సాహాకాన్ని విద్యాశాఖ అందిస్తున్నది.