Gurrala Sarojanamma | గుర్రాల సరోజనమ్మకు ఇప్పుడు 84 ఏండ్లు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉంటారు. కృష్ణా జిల్లా కాటూరు ఆమె పుట్టినూరు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత వారి కుటుంబం బోధన్‌కు వలస వచ్చింది. అక్కడే చదువు పూర్తిచేసిన సరోజనమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయినిగా సేవలందించారు. ఆమె భర్త బోధన్ చక్కెర కర్మాగారంలో పనిచేశారు. ఈ దంపతులకు సంతానం లేదు. దాంతో సమాజానికి తమవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించారు. దీనికీ ఓ నేపథ్యం ఉంది.
బోధన్‌లో ఒక ఇంట్లో అద్దెకున్న ఓ కుటుంబ పెద్ద దవాఖానలో మరణించాడు. ఇంటి యజమాని ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. దాంతో పార్థివదేహాన్ని ఇంటి వెలుపలే ఉంచి, తర్వాత అంతిమ సంస్కారాలు జరిపించారు. ఈ సంఘటన సరోజనమ్మ మనసును కదిలించింది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. శవాలను భద్రపర్చుకుని, తమతమ సంప్రదాయాల మేరకు అంతిమ సంస్కారాలు చేసుకునే వెసులుబాటు ఉండేలా ఓ భవనం నిర్మించాలని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఉదారంగా భూమిని కేటాయించింది. అలా సరోజనమ్మ 20 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక దగ్గర్లో అన్ని వసతులతో ‘ధర్మస్థల’ పేరుతో ఓ భవనం నిర్మించారు. అవసరం ఉన్నవాళ్లు ఉచితంగా వాడుకోవచ్చు. ఎవరైనా విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఉంది.
ఇక ఈ భవనం నిర్వహణ చూసుకునేందుకు నెలకు 4,000 రూపాయల జీతంతో ఓ వాచ్‌మెన్‌ను నియమించారు. ఈ ఖర్చును సరోజనమ్మ భరిస్తున్నారు. తన సేవలను గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమస్థలం కందకుర్తికీ విస్తరించారు. అక్కడ గోశాల నిర్మాణానికి రెండున్నర లక్షలు సమకూర్చారు. నిజామాబాద్ నామ్దేవ్వాడలో మల్లు స్వరాజ్యం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన ఓ ఫార్మసీకి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. అంతేకాకుండా చింతకుంటలో వృద్ధాశ్రమాలకు కూడా తనవంతు సాయం అందిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు.. విశ్రాంత ఉద్యోగుల సంఘం కోసం కోట్ల రూపాయలు విలువచేసే తన ఇంటిని దానంగా ఇవ్వడం మరో ఎత్తు. ఆమె గురించి తెలిసిన వాళ్లు సరోజనమ్మను ‘పెద్దమ్మా’ అని ఆప్యాయంగా పిలుస్తారు. భర్త మరణంతో ఒంటరైన ఆమెకు సమాజమే కుటుంబంగా మారింది. ఆమె సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాజ్‌భవన్‌లో సన్మానించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ కూడా తగిన విధంగా సత్కరించింది. సేవలోనే సంతృప్తిని వెతుక్కున్న సరోజనమ్మ జీవితం స్ఫూర్తిదాయకం.