హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం అద్భుతంగా ఉన్నదని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ కమిషన్ చైర్మన్లు ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి రాష్ట్రం తెలంగాణ మాడల్‌ను అనుసరించాలని సూచించారు. శనివారం హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని సమీకృత మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు, సభ్యులు సందర్శించారు.
ఘన వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తిచేసే తీరును పరిశీలించారు. వారికి వ్యర్థాల నుంచి విద్యుత్తు శక్తిని ఉత్పత్తి చేసే విధానాన్ని ప్లాంట్ ఎండీ గోపీనాథ్‌రెడ్డి వివరించారు. పర్యావరణ పరిరక్షణలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉన్నదని చైర్మన్లు ప్రశంసించారు. వ్యర్థాలను సైతం పర్యావరణానికి ఉపయోగపడేలా మలచడంలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని కితాబిచ్చారు.
ప్లాంట్‌ను సందర్శించినవారిలో టీఎస్ఈఆర్సీ చైర్మన్ టీ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బీ కృష్ణయ్య, టీఎన్‌ఈఆర్సీ చైర్మన్ ఎం చంద్రశేఖరం, సభ్యుడు కే వెంకటేశ్వర్, కేఈఆర్సీ చైర్మన్ పీ రవికుమార్, సభ్యులు హెచ్ఎం మంజునాథ్, ఎండీ రవి, కేఎస్ఈఆర్సీ చైర్మన్ టీకే ఘోష్, సభ్యుడు బీ ప్రదీప్, ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, రామ్‌సింగ్, పీ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.
యాదగిరిగుట్టను సందర్శించిన దక్షిణాది ఈఆర్సీ చైర్మన్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దక్షిణాది రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) చైర్మన్లు శనివారం కుటుంబసమేతంగా దర్శించుకొన్నా రు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం, డీఈవో దో ర్బాల భాస్కర్‌శర్మ ప్రసాదం అందజేశారు.