జడ్చర్లటౌన్, మే 18 : సాధారణంగా మొక్కలను కీటకాలు తింటాయి.. కీటకాలను తినేశక్తి కలిగిన అరుదైన మొక్క మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లోకి వచ్చిందని గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య తెలిపారు. నెపంథిస్ అనే జాతికి చెందిన ఈ మొక్క మొక్కవద్దకు రాగానే మొదటి భాగాన ఉన్న జిగురుతో కీటకాలు కూజాలోకి జారిపోతాయని వెల్లడించారు. ఈ మొక్కలు కీటకాలను జీర్ణం చేసుకొని వాటికి అవసరమైన పోషకాలను పొందుతాయని తెలిపారు. ఈ మొక్కలు నాగాలాండ్‌లో పెరుగుతాయని తెలిపారు. ఓరుగల్లు వైల్ట్‌లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్ ఈ మొక్కలను కర్ణాటకలోని కూర్గ్ నర్సరీ నుంచి సేకరించి బొటానికల్ గార్డెన్‌కు అందజేసినట్టు పేర్కొన్నారు.