Eklavya School | బయ్యారం, ఆగస్టు 4: ఉడకని అన్నం.. పురుగులు, రాళ్లు ప్రత్యక్ష్యం.. నీళ్ల చారు.. ఇదీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండ లం నామాలపాడు ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం. ఈ భోజనం తినలేకపోతున్నాం.. తింటే కడుపునొప్పి వస్తుంది.. అని తమ తల్లిదండ్రుల వద్ద ఏడుస్తూ తెలిపిన విద్యార్థుల అరిగోస అంతా ఇంతా కాదు. ఈ పాఠశాలలో ఉండలేక, అక్కడి తిండి తినలేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. నామాలపాడు ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలను రూ.35 కోట్లతో అధునాతన హంగులతో నిర్మించి, 2022 డిసెంబర్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 550 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీరు లేక నెలరోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం విద్యార్థులను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థులు తమ దుస్థితిని కండ్లకు కట్టినట్టు వివరించారు.
కంపుకొడుతున్న మరుగుదొడ్లు
పాఠశాలలో చుక్క నీరు లేదని, రోజూ సరిగ్గా స్నానం కూడా చేయడం లేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి కంపు కొడుతుండటంతో ముక్కు మూసుకొని వెళ్తున్నామని చెప్పారు. దీంతో తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని వాపోయారు. అంతేగాకుండా మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, సరిగ్గా ఉడకని, పురుగులు, రాళ్లు ఉన్న అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని, ఈ తిండి తినలేకపోతున్నామని, తింటే కడుపునొప్పి వస్తుందని ఏడుస్తూ తెలిపారు. ఇక్కడ ఉండలేమని, ఇంటికి తీసుకెళ్లాలని కొందరు పిల్లలు తమతల్లిదండ్రుల మారాం చేయడంతో విద్యార్థుల దీనస్థితిని చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. పాఠశాల దుస్థితిపై విద్యార్థుల తల్లితండ్రులు అసంతృప్తిని, అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను తీర్చాలని కోరారు. ఇటీవల గూడూరు ఏకలవ్య పాఠశాల నుంచి 150 మంది విద్యార్థులను ఇక్కడికి మార్చారని, కొన్ని రోజులపాటు ఉన్న వారు నీటి సమస్య, భోజనం బాగాలేక వారిలో కొందరు వెనుదిరిగి వెళ్లినట్టు సమాచారం.
ఏకలవ్య స్కూల్లో ఏండ్లుగా నీటి సమస్య
నామాలపాడు ఏకలవ్య స్కూల్లో శాశ్వత నీటి సౌకర్యం కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడి భూమి పొరల్లో బొగ్గు ఉండటంతో నీటిని ఉపయోగించుకునే వీలు లేదు. విద్యార్థుల అవసరాలకు మిషన్ భగీరథ నీటిని నిల్వచేసి వాడుతున్నారు. భగీరథ నీరు లేనప్పుడు ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి వాడుతారు. కొన్నిసార్లు నీరు అందుబాటులో లేక విద్యార్థులు రెండు మూడు రోజులపాటు స్నానాలు కూడా చేయని పరిస్థితులు ఉంటున్నాయి. విద్యార్థులు ఇంత ఇబ్బందిపడుతున్నా అధికారులు మాత్రం నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. మరో రూ.15 కోట్లతో సిబ్బంది వసతి కోసం నిర్మిస్తున్న క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
నా బిడ్డ పరిస్థితి చూసి ఏడుపొచ్చింది..
‘అమ్మా వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు కూడా నీళ్లు లేవు.. ఇక్కడెలా ఉండాలమ్మా. ఇంటికొస్తా తీసుకపో’ అని నాబిడ్డ అంటుంటే ఏడుపొచ్చింది. దగ్గరికి తీసుకొని నేనూ ఏడ్చిన. మా అమ్మాయి ఆస్మిత ఏకలవ్యలో ఆరో తరగతి చదువుతున్నది. చూద్దామని హైదరాబాద్ నుంచి వచ్చా. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. బట్టలు ఉతుక్కునేందుకు కూడా నీళ్లు లేక వారం వారం ఇంటికి తీసుకెళ్లి ఉతికి తీసుకొస్తున్నాం. నీటి ఇబ్బందిపై చాలాసార్లు నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉడకని అన్నం పెడుతుంటే కడుపునొప్పితో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
– వనజ, విద్యార్థిని ఆస్మిత తల్లి
రెండు రోజులుగా అన్నం తినలేదు..
భోజనం సరిగ్గా లేక రెండు రోజుల నుంచి అన్నం తినలేదు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయి. చాలా గలీజ్‌గా ఉంటుంది. తింటే కడుపునొప్పి వస్తున్నా, తప్పని పరిస్థితుల్లో తింటున్నాం. కూరలు కూడా బాగుండటం లేదు. నీళ్లు లేక టాయిలెట్స్ కంపు కొడుతున్నా, ముక్కుముసుకొని వెళ్లి వస్తున్నాం. సార్లకు చెప్తే వస్తాయిలే.. అంటున్నారు, కానీ రావడమే లేదు.. నీటి సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడ ఉండలేము.
– కల్యాణ్, ఏడో తరగతి
నీరు లేక గోస పడుతున్నాం
స్కూల్లో నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి నింపినా ఉదయానికే అయిపోతున్నాయి. కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదు. అన్నం, కూరలు కూడా సరిగ్గా ఉండటం లేదు. ఫ్యాన్లు, లైట్లు పనిచేయడమే లేదు. అధికారులకు చాలాసార్లు చెప్పినా వాటిని పరిష్కరించడం లేదు.
– చందన, తొమ్మిదో తరగతి