హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పన్నేతర (నాన్-ట్యాక్స్) రెవెన్యూ రాబడులను పెంచడంతోపాటు కేంద్ర నిధులను సాధించుకోవడంపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్‌కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార ఆదేశించారు. ప్రజాప్రయోజనాలు, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు పని చేయాలని సూచించారు. రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతన మేరకు బడ్జెట్ నిధులను ఖర్చు చేయాలని చెప్పారు. సచివాలయంలో ఆదివారం జరిగిన అసెట్స్ సబ్ కమిటీ భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వ పథకాలను ఒకటి కూడా ఆపకుండా కొత్తగా రూ.33,600 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు భట్టి చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. బడ్జెట్ నిధుల్లో కొన్ని శాఖలకు అధికంగా, మరికొన్ని శాఖలకు తకువగా అందుతున్నాయయని పేర్కొంటూ.. అన్ని శాఖలకు సమానంగా నిధులు పంచాలని అధికారులను ఆదేశించారు.
ఖర్చుల్లో శాఖల మధ్య అంతరాలను తగ్గించి అన్నింటిని ఒకే స్థాయిలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం సమగ్రంగా ముందుకెళ్తుందని చెప్పారు. రానున్న పది రోజుల్లో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.