Influencers | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్‌లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ల పేరుతో ఫాలోవర్స్‌ను బలి చేస్తున్నారు. అలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్లలో కొందరు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుండటంతో మిగిలిన వారు ఇరకాటంలో పడ్డారు. కలుగుల నుంచి ఎలుకల్లా బయటికి వచ్చి.. తాము చేసింది తప్పేనని, ఇక నుంచి అలాంటి తప్పులు చేయబోమని క్షమాపణలు కోరుతున్నారు.
‘మీకు ఐఫోన్-15 కావాలా? ఖరీదైన వాచ్‌లు కావాలా? అయితే వెంటనే నా చానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోండి. కింద ఉన్న టెలిగ్రామ్ లింక్‌ను ఓపెన్ చేసి, నా చానల్లో చేరండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడి విలువైన బహుమతులను సొంతం చేసుకోండి. గేమ్‌లో గెలిచి డబ్బులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందండి’ అంటూ ఓ ఇన్ఫ్లూయెన్సర్ తన యూట్యూబ్ అకౌంట్లోని దాదాపు 42.2 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లకు ప్రతిరోజూ ఆశపెడుతున్నాడు. అతను ఇచ్చిన టెలిగ్రామ్ లింక్‌ను ఓపెన్ చేస్తే నేరుగా అతని చానల్ ఓపెన్ అవుతుంది. అందులో అతను చెప్పినట్టుగా టెలిగ్రామ్ వీడియో కింద ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే నేరుగా ‘1విన్’ అనే బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో కనీసం రూ.300 బెట్టింగ్ పెట్టమంటాడు. అలా పెడితే.. మొదటిసారి కనీసం రూ.600 వస్తాయి. ఆ డబ్బులతో మళ్లీ బెట్టింగ్ పెడితే విన్నింగ్ అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది. అలా మనతో సాధ్యమైనంత ఎక్కువ బెట్టింగ్ పెట్టించి మొత్తం సొమ్మును ఒకేసారి కాజేస్తారు. ఇలాంటి యాప్‌లను ఫాలోవర్స్‌కు అంటగడుతున్న ఇన్ఫ్లూయెన్సర్లకు భారీగా నగదుతోపాటు బైక్‌లు, కార్ల లాంటి ఖరీదైన బహమతులు అందుతున్నట్టు సమాచారం.
ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే బెట్టింగ్ యాప్‌లకు ఎంతో మంది యువకులు బానిసలై భారీగా డబ్బులు కోల్పోతున్నారు. అంతటితో ఆగకుండా డబ్బుల కోసం అదే ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పిన లోన్‌యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోయినా రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తుండటంతో ఆ యాప్‌ల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. వాటిని తీర్చలేక, ఇంట్లో చెప్పలేక, చదువు ముగించలేక తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
బెట్టింగ్, లోన్ యాప్‌లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చర్యలు చేపట్టడం లేదని పోలీసులు, సీఎస్బీ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేవారిని కట్టడి చేయాలని, కనీసం వారికి కౌన్సెలింగ్ అయినా ఇచ్చి హెచ్చరికలు జారీచేయాలని ఎంతో మంది కోరుతున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల వల్ల ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌లో మోసపోయినవారు బయటికి రావాలి. ఆ యాప్‌లలో బెట్టింగులు పెట్టేలా మిమ్మల్ని పురిగొల్పిన ఇన్ఫ్లూయెన్సర్లపై సమీప పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలి. బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయించేందుకు మేం చేపట్టిన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు కలిసి రావాలి. యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. జూదంతో జీవితాలే తల్లకిందులవుతాయని మహాభారత కాలం నుంచే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి ఏం చేస్తున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. నిండా మునిగిన తర్వాత ఎంత బాధపడినా ఫలితం ఉండదు.