హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో 13% అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాలం మారుతున్న సమయంలో ఎండల తీవ్రత ఉంటుందని, దీనికి ఎల్‌నినో ప్రభావం కూడా ఉందని పేర్కొన్నది. ఎల్‌నినో ప్రభావం డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్‌లోకి వెళ్తుందని, మే వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. నవంబర్ 2వ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పింది. ఈ సారి చలికాలంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రావణి తెలిపారు.