Krishna river | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. దీంతో కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి. సోమవారం సైతం ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టులకు సైతం వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలకు ప్రస్తుతం 8.10 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో జూరాల నుంచి వరదను దిగువను విడుదల చేస్తున్నారు.
దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఇక గోదావరి క్రమంగా శాంతిస్తున్నది. శ్రీరాంసాగర్‌తోపాటు, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇక ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 5.30లక్షల క్యూసెక్కుల వరద రాగా, సోమవారం సాయంత్రం అది 5.60లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 75గేట్లను ఎత్తి లక్ష్మీ బరాజ్ నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదిలాఉంటే భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. మొత్తంగా భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం 43 మీటర్ల మేర ప్రవహించిన గోదావరి సోమవారం సాయంత్రానికి 36మీటర్లకు తగ్గిపోయింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఉన్న బోసికుర్జ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వార్ధానదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది.
19