హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ఉద్యోగ నియామకాల్లో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధపడుతున్నదని నిరుద్యోగులు చెప్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సరిగా చేయకపోవడంతో అకాడమిక్ మార్కులతో పాటు నిబంధనలకు విరుద్ధంగా లాంగ్వేజెస్ మార్కులు కూడా కలిపి కొందరికి ఉద్యోగాలు ఇస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికే అన్ని ఆధారాలను పోలీసు రిక్రూట్మెం ట్ బోర్డుకు సమర్పించగా.. వాటిని కనీసం పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు నుంచి సమాధానం ఆశించిగా.. ఎంతకూ వా రికి రిప్లయ్ రాకపోవడంతో.. తమ వద్దనున్న ఆధారాలతో వారు శుక్రవారం హైకోర్టు మెట్లు ఎక్కారు. తమకు న్యాయం చేయాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదట్నుంచి చేపట్టాలని డి మాండ్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానానికి అన్ని ఆధారాలను సమర్పించినట్టు తెలిపారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా.. అనర్హులు పలు పోస్టులకు అర్హులయ్యారని, కొన్ని పోస్టులకు వారి పేరు ఫైనల్ షార్ట్‌లిస్ట్ అయినట్టు బాధితులు చెప్తున్నారు.
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉద్యోగాల్లో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్ (బయోలజీ/సెరాలజీ) ఉద్యోగానికి కచ్చితంగా బీఎస్సీ బయోలజీ లేదా జియోలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జెనిటిక్స్, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ (ఇంటర్), బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సుల్లో ఏది చదివినా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ విభాగంలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఓ విద్యార్థినిని ఎంపిక చేసి, షార్ట్‌లిస్టు చేసినట్టు ఆధారాలు సహా నిరూపిస్తున్నారు.
సదరు అభ్యర్థికి ఇటీవల మరొకసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారని, అప్పటికే ఆమెను ఫైనల్ చేయడంతో తప్పు ఎక్కడ బయట పడుతోందోనని ఆమెకే ఆ పో స్టును అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు నుంచి వివరణ తీసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు స్పందించలేదు. తమ అభ్యర్థనలకు బోర్డు స్పందించకపోయినా.. న్యాయస్థానాలకు మాత్రం సమాధానం ఇవ్వాల్సిందేనని నిరుద్యోగులు వాపోతున్నారు.