Telangana | బండ మీద పంట పండించే ఆలోచనలు చేయడంలో సీఎం కేసీఆర్‌ది ప్రత్యేక స్థానం.. ఆకలి కేకల గానం చేసిన తెలంగాణను దేశానికి అన్నం పెట్టే స్థాయిలో నిలబెట్టేందుకు తనదైన మార్కుతో ‘పరిశ్రమించారాయన.. ఫలితంగా స్వరాష్ట్రంలో పారిశ్రామికరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. గడిచిన పదేండ్లలో రాష్ర్టానికి లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది కంపెనీల రాక చకచకా జరిగిపోయింది.. లక్షలాదిగా ఉద్యోగాల సృష్టి జరిగింది. పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ-పాస్ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నాయి.
తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ రాష్ర్టానికి చెందిన పారిశ్రామికవేత్తలతో సుదీర్ఘ సమావేశం ఏర్పాటుచేసి రాష్ట్రంలో పారిశ్రామికరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. 2015లో టీఎస్ ఐ-పాస్ పేరుతో ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణకు కొత్తగా 23 వేల పరిశ్రమలను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దార్శనికతకు తోడు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో అనేక దేశ, విదేశీ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి నగరాలను కాదని తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)ను అభివృద్ధి చేశారు. ఇందులో రావిర్యాల క్లస్టర్ 603 ఎకరాల్లో, మహేశ్వరం క్లస్టర్ 310 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రావిర్యాలలోని ఈ-సిటీలో 48 కంపెనీలకు భూములు కేటాయించగా, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.1,585 కోట్ల పెట్టుబడులు రాగా, వచ్చే ఏడాది మరో రూ.2,626 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా, మహేశ్వరం క్లస్టర్ లో 14 కంపెనీలకు భూములు కేటాయించగా, నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో రూ.472 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 5,216 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వచ్చే ఏడాది చివరికల్లా ఇందులో ఖాళీ జాగను కూడా కంపెనీలకు కేటాయించనున్నారు.
సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో చందన్‌వల్లి ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఇది మల్టీప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్. 20,000 ఎకరాల్లో దీన్ని ప్రతిపాదించారు. అత్యుత్తమ కార్పెట్ టైల్స్ తయారీ సంస్థ వెల్స్పన్ ఫ్లోరింగ్, గ్రీన్ కార్పెట్స్ తదితర ఉత్పత్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకూ భూములు కేటాయించగా, ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో మెడికల్ డివైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 50 కంపెనీలు ఏర్పాటు కాగా, రూ.839 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5,465 మందికి ఉపాధి లభించింది.
టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది. 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, సుస్థిర, సమర్థవంతమైన పాలన పరిశ్రమలకు వరంగా మారాయి. సమైక్య రాష్ట్రంలో పలు కారణాలతో దాదాపు 10,000 పరిశ్రమలు మూతపడగా, పారిశ్రామికవేత్తలు దికుతోచని స్థితిలో విలవిల్లాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. స్వరాష్ట్రంలో ఈ సమస్యలన్నింటికీ పరిషారం లభించింది. ఇప్పటివరకు రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 22.50 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.1400 కోట్లు ప్రోత్సాహకంగా అందించారు. ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికీ తగిన ప్రాధాన్యమిస్తున్నారు. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్ల పునరుద్ధరణ దీంట్లో భాగమే.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ మహా నగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతున్నది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తున్నది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనాలని ఆహ్వానాలు అందుతున్నాయి. గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలేగాక, ఈ మధ్య ఇంగ్లండ్, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. కొన్ని సంస్థలు అకడికకడే ఒప్పందాలు చేసుకున్నాయి.
1,190 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. రూ.11,586 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 1,13,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. గణేశా ఎకోస్పేర్, కిటెక్స్, యంగ్ వన్ కార్పొరేషన్ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే రూ.2,527 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా 22,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గణేశా ఎకోస్పేర్ మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించగా, మిగిలిన రెండు కంపెనీలు కూడా ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసింది. ఇందులో 56 ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేశారు. మరో 50 వరకు పార్క్‌ల పనులు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో కొత్తగా 70 ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటు ప్రతిపాదనలున్నాయి. జిల్లాలవారీగా ఒక్కొక్కటి 500 ఎకరాలకు తగ్గకుండా హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేస్తున్నారు. కొత్త ఇండస్ట్రియల్ పార్కుల్లో అవసరమైన విద్యుత్తు, నీటి సరఫరా, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.
తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టీఐఎఫ్) భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 523 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 621 కంపెనీలకు ఇప్పటికే భూములను కేటాయించగా, రూ.1,200 కోట్ల పెట్టుబడులు రావడంతో 19,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ఎఫ్‌టీసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్‌కు సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలు కేటాయించారు. ఎంఎస్ఎంఈల గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 26 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యింది.
ఇక్కడ మల్టీ ప్రొడక్ట్ తయారీ జోన్‌ను ప్రతిపాదించారు. 12,635 ఎకరాల్లో నిమ్జ్ పథకం కింద మొదటి దశలో 3,909 ఎకరాలు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.13,300 కోట్లు కాగా, రూ.60,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మాస్టర్ ప్లాన్, ఈఎస్ఐఏ అధ్యయనం పూర్తయ్యింది. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల ఎకరాలను పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే వివిధ కంపెనీలకు 28,000 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తదితర పారిశ్రామికవాడలు ముఖ్యమైనవి.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఔషధ క్లస్టర్‌గా 14,029 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రూ.64,000 కోట్ల మేర పెట్టబడులు వస్తాయని, తద్వారా 4.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ కింద 8,900 ఎకరాల్లో ఔషధ పార్క్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు.
ఇబ్రహీంపట్నం మండలం ఖాల్సా గ్రామంలోని 123 ఎకరాల్లో దీని ఏర్పాటుకు ప్రతిపాదించారు. 43 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యింది. రూ.55 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఉత్పత్తులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.