హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): యువతకు ఉపాధి, వివిధ రకాల పండ్లు సాగుచేసే రైతులను ప్రోత్సహించేలా బహుళజాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించడం, తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్‌గేర్, బుషింగ్స్ పరిశ్రమ ఏర్పాటు, హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల ఏర్పాటు ద్వారా రూ. 3,745 కోట్ల పెట్టుబడులతోపాటు సుమారు 1,518మందికి ఉపాధి లభిస్తుందని సబ్‌కమిటీ బృందం వెల్లడించింది.