Industrial Park | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలో 362 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. సర్వే నంబర్ 162లోని 216 ఎకరాలతోపాటు వివిధ సర్వే నంబర్లలోని భూములను సేకరించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భూ యజమానులు నష్ట పరిహారంపై చర్చించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజు లు గడువిచ్చారు.
భూములు కోల్పోతున్నవారు గడువులోగా కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భూసేకరణ చట్టం ప్రకారం.. సంబంధిత అధికారులు నోటిఫై చేసిన భూముల్లోకి వెళ్లేందుకు, సర్వే చేసేందుకు, తవ్వకాలు జరిపేందుకు, ఇతర నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారా లు కల్పించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి ఈ భూముల్లో ఆర్డీవో అనుమతి లేకుండా ఎటువంటి లావాదేవీలు జరపరాదని స్పష్టంచేశారు. ఇటీవల లగచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. ప్రజల నుంచి ప్రతిఘటన తలెత్తగానే వెనక్కు తగ్గి జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.
అయినా లగచర్లలో రైతుల నుంచి వ్యతిరేకత ఇంకా చల్లారలేదు. అక్కడ ఎక్కువ గా గిరిజనుల భూములను సేకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా తిమ్మాపూర్లో మొ త్తం 567 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తీవ్ర వివాదస్పదమైంది. హైదరాబాద్కు అతి సమీపంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ భూముల విలువ రూ.కోట్లలో ఉండగా, భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధర చెల్లించే అవకాశం లేదు. ఇప్పటికే తిమ్మాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తామంతా భూ ములపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అగ్గువ ధరలకు భూములను లాక్కుంటే తాము ఉపా ధి కోల్పోయి రోడ్డున పడతామని, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంతో మరో ప్రాంతంలో భూ ములు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం అసైన్డ్ భూములను సేకరించడాన్ని వివిధ రాజకీయపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. వ్యవసాయ యోగ్యంకాని భూములను పరిశ్రమల కోసం సేకరించాలని, పచ్చని పంటపొలాల్లో పారిశ్రామికవాడలను ఏర్పాటుచేసి పల్లె ప్రాంతాలను కలుషితం చేయరాదని వారు కోరుతున్నారు. మొత్తమ్మీద ప్రజావ్యతిరేకత ఎలా ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్లు విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
టీజీఐఐసీ వద్దే 5730 ఎకరాలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 28,458 ఎకరాల్లో 156 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసినా ఎక్కడా చెప్పుకోదగ్గ వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం విశేషం. ఎందుకంటే, గత ప్రభుత్వం పరిశ్రమల కోసం రైతులను ఇ బ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు ప్ర భుత్వ భూములు, వ్యవసాయ యోగ్యత లేని భూములనే వినియోగించింది. అంతేకాదు, ఇంకా 5,730 ఎకరాల భూములు కంపెనీల కు కేటాయించేందుకు టీజీఐఐసీ వద్ద సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ సర్కారు 1,45,682.99 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశ్రమల కోసం ఎంపికచేసింది. వీటిని ఇండస్ట్రియల్ ల్యాండ్బ్యాంక్గా నోటిఫై చేశా రు. అయితే, కాంగ్రెస్ సర్కారు మాత్రం అసైన్డ్ భూములు, పంట పొలాలను పరిశ్రమల కోసం సేకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.