దోమ, ఏప్రిల్ 8 : తమకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దే వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామస్థులంతా ఏకమై ముక్తకంఠంతో అధికారులు పంపిన నోటీసులను తిరస్కరించి ఏకగ్రీవ తీర్మారం చేసి మండల అధికారులకు పంపించారు.
గ్రామంలోని 237 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ పార్క్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని తహసీల్దార్ గోవిందమ్మకు తీర్మానపత్రం అందజేశారు. తాము భూములను నమ్ముకొని జీవిస్తున్నామని, భూములు కోల్పోతే తామంతా రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పూర్వీకుల నుంచి వచ్చిన భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.