రుణమాఫీ పూర్తికాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. చేయాలన్న ఉద్దేశమూ దానికి లేదని తేలిపోయింది. బడ్జెట్లో ఒక్క రూపాయీ కేటాయించలేదు. ఇక ఎకరానికి రూ.15 వేలు ఇస్తానన్న ప్రభుత్వం.. రైతుభరోసా ఆశలపైనా నీళ్లు చల్లింది. ఇప్పటికే రెండు పంట సీజన్లకు పాత రైతుబంధుతోనే సరిపెట్టిన సర్కార్.. ఈ ఏడాది ఇస్తానన్న భరోసాపైనా చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నది. పింఛన్లు రూ.4 వేలు చేస్తానన్న ‘చేయూత’ గ్యారెంటీనీ అటకెక్కించింది. పథకం అమలుకు 27వేల కోట్లు అవసరం కాగా, కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తానన్న రూ.2,500పై ప్రభుత్వ పద్దులో కనీస ప్రస్తావన లేదు. ఇక అంతోఇంతో అమలవుతున్న పథకాలకూ ఈసారి బడ్జెట్లో నిధుల కోత పెట్టిం ది. ఫ్రీ బస్ పథకానికి కేటాయింపులు తగ్గించింది. ఉచిత కరెంటు స్కీం ‘గృహజ్యోతి’కి ఏకంగా 350 కోట్ల మేర నిధులు తగ్గించింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి మా త్రం నిరుడు ఇచ్చినట్టే ఈసారీ నిధులు కేటాయించింది. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేనని విస్పష్టంగా ప్రకటించింది.
‘గారడీ చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు.. తొండికి దిగుతుండ్రు..!మొండికి పోతుండ్రు..’ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై నాడు కేసీఆర్ రాసిన పాట ఇది. అదే కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే అప్పటికీ, ఇప్పటికీ దానితీరు మారలేదని తేటతెల్లమవుతున్నది. తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పొడుస్తూ వస్తున్న కాంగ్రెస్.. డిక్లరేషన్లను గాలికొదిలేసింది. ఇప్పుడిక గ్యారెంటీలను గంపగుత్తగా గాయబ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రారంభించక కొన్ని, పైసా విదల్చక మరికొన్ని.. గ్యారెంటీల గొంతుకోసేందుకు సిద్ధమైంది.
ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెప్పుకుంటూ తిరగడాన్ని జాతీయ మీడియా, ఆర్థికవేత్తలు అందరూ ఏకిపారేస్తున్న వేళ.. రూ.3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 15 నెలల్లో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థే పద్దులోని ప్రతి పేజీలోనూ ప్రతిబింబించింది. అంకెల గారడీయే తప్ప.. దీర్ఘకాలిక వ్యూహమేదీ కనిపించలేదు. కొత్త పథకాల ప్రకటన లేదు. గత ప్రభుత్వ స్కీముల కొనసాగింపునకూ సర్కారు సిద్ధంగా లేదు. కీలకరంగాలకు కేటాయింపుల్లేవు. ఖజానా బలోపేతంపై దృష్టిలేదు. పుట్టెడు అప్పులు, తట్టెడు అబద్ధాలే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనేదీ ప్రభుత్వ పద్దులో కనిపించలేదు. అప్రకటితంగానే ఆరు గ్యారెంటీలకు సర్కారు ఉరితాడు పేనుతున్నది.
Telangana Budget | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : అలవిగాని ఆరు గ్యారెంటీల గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది. ‘మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినం.. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆరు గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయలేము’ అంటూ బీద ఏడ్పులు ఏడ్చిన సర్కారు.. ఏడాది తర్వాత కూడా అదే బేల తనాన్ని ప్రదర్శిస్తున్నది. తాజా బడ్జెట్లో మొదలు పెట్టిన గ్యారెంటీలకు అరకొర నిధులు కేటాయించి.. మిగతా గ్యారెంటీలకు గుండు సున్నా ఇచ్చింది. ఒక్కో పథకానికి వేల కోట్లు కావాల్సి ఉంటే.. వందల కోట్లతోనే సరిపెట్టి చేతులు దులుపుకొన్నది. ఉన్న పథకాల్లో నిధుల కోతతో ఏడాది వరకు కొత్త లబ్ధిదారులకు అవకాశం లేనట్టేనని స్పష్టమవుతున్నది. ఆరు గ్యారెంటీల్లో మిగిలినవాటి అమలు దైవాదీనమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ మొత్తం 15 హామీలిచ్చింది. వీటిలో ఒక్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప 4 హామీలు అరకొరగానే అమలవుతున్నాయి. ఇక 10 హామీలను ప్రభుత్వం అటకెక్కించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళలకు రూ. 2500 ప్రస్తావనేదీ?
మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలి బడ్జెట్లోనూ ఈ హామీపై ఎలాంటి ప్రస్తావన చేయని సర్కారు.. తాజా బడ్జెట్లోనూ దీన్ని పక్కకు పెట్టేసింది. రాష్ట్రంలో 1.68 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.4,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన సర్కారు తీరుతో రాష్ట్ర మహిళలు ఇంత భారీ మొత్తాన్ని నష్టపోతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఈ హామీకి దాదాపుగా మంగళం పాడినట్టేనన్న ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తవారికి రూ.500 గ్యాస్ లేనట్టే
మహాలక్ష్మి పథకంలో భాగంగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నది. ఈ పథకానికి నిరుడు బడ్జెట్లో రూ.723 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజా బడ్జెట్లోనూ అంతే మొత్తం కేటాయించింది. ప్రస్తుతం ఈ పథకం కింద 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
రైతులకు ‘భరోసా’ దక్కేనా?
రైతుభరోసా కోసం ఈ బడ్జెట్లో రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నిరుడు బడ్జెట్లో పేర్కొన్న ప్రభుత్వం ఈసారి మాట తప్పి రూ.12 వేలకు కుదించింది. గత వానకాలం రైతుభరోసాను ఎగ్గొట్టగా తాజాగా యాసంగి భరోసా కూడా ఇప్పటి వరకు అందించలేదు. దీంతో బడ్జెట్లో కేటాయింపులే తప్ప.. రైతులకు భరోసా దక్కడం లేదన్న విమర్శలున్నాయి.
సన్న రైతులకు బోనస్ కష్టమే!
ఎన్నికల్లో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కేవలం సన్నాలకే ఇస్తామంటూ మెలిక పెట్టింది. పోనీ ఆ సన్న ధాన్యానికైనా పూర్తిగా ఇస్తున్నదా? అంటే అదీ లేదు. రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి సుమారు 80 నుంచి కోటి టన్నుల సన్నాలు ఉత్పత్తి అవుతాయి. ఈ లెక్కన బోనస్ కింద రూ.5 వేల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో కేవలం రూ. 1800 కోట్లే పెట్టి మమ అనిపించింది. దీంతో సన్నధాన్యం బోనస్‌పై అనుమానాలున్నాయి.
విద్యాభరోసా ఏదీ?
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ.. గాలిమాటగానే మిగిలిపోతున్నది. రెండు బడ్జెట్లు ముగిసినా ఈ హామీపై సర్కారు ఒక్క మాట కూడా ఎత్తలేదు. ఓవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా మరోవైపు భరోసా కార్డు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదనే విమర్శలున్నాయి.
ఇంటర్నేషనల్ స్కూళ్లకు రూ.8700 కోట్లు కోత
నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సర్కారు, నిధుల కేటాయింపులో భారీగా కోత పెట్టింది. 58 స్కూళ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్లో రూ. 2900 కోట్లే కేటాయించింది. అంటే రూ. 8700 కోట్లు కోత పెట్టింది. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు వారికీ మొండిచెయ్యి చూపిస్తున్నది. 50 శాతం నిధులే ఇచ్చింది. దీంతో పింఛన్ పెంపు కలగానే మిగలనున్నది.
ఇందిరమ్మ ఇండ్లకు ఈ నిధులు ఏ మూలకు?
ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు మాటలు, కేటాయింపులే తప్ప ఆచరణలో చూపడం లేదు. గత బడ్జెట్లో చెప్పిన అబద్ధాలనే మళ్లీ వల్లెవేసింది. గత బడ్జెట్లో నియోజకవర్గానికి 3500 చొప్పున 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. రూ.22,500 కోట్లు అవసరమని అంచనా వేసింది. సరిగ్గా ఈ బడ్జెట్లోనూ ఇదే హామీని రిపీట్ చేసింది. ఈ లెక్కన ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించాల్సింది రూ.45 వేల కోట్లు కాగా రూ.12,571 కోట్లే కేటాయించింది. ఈ నిధులు రూ.5 లక్షల చొప్పున కేవలం 2.51 లక్షల ఇండ్లకే సరిపోతాయి. మరి మిగిలిన 6.49 లక్షల ఇండ్ల సంగతేమిటనేది ప్రశ్నార్థకం! ఇక ఈ పథకంలో భాగమైన ఇంటిస్థలం లేని వారికి స్థలం కేటాయింపు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీలకు అతీగతీ లేదు.
గృహజ్యోతి’కి రూ.338 కోట్లు కోత
200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి కొత్తవారి ఇండ్లలో ‘గృహజ్యోతి’ వెలగ డం కష్టమేనని స్పష్టమవుత్నుది. తాజా బడ్జెట్ లో గృహజ్యోతి పథకం నిధులకు సర్కారు కోత పెట్టింది. నిరుడు రూ.2418 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈబడ్జెట్లో దీన్ని రూ. 2080 కోట్లకు తగ్గించింది. గతంకంటే రూ.338 కోట్లు కోత విధించింది. ప్రస్తుతం 50 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధిపొందుతుండగా బడ్జెట్లో కోత పెట్టడంతో వారి సంఖ్యలోనూ కోత పెడతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గొప్పలకు పోయి నవ్వులపాలు
లేని గొప్పలకుపోయి నవ్వులపాలైనట్టు బడ్జెట్ ఉన్నది. ఇది అన్ని రంగాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రేవంత్ పాలనలో లక్షా 50 వేల పింఛన్లు కోత పెట్టింది వాస్తవం కాదా? రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.20 వేల కోట్లతో సరిపుచ్చారు. ఏటా రెవెన్యూ మిగులు ఉంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎలా చెబుతారు? దళితులు, గిరిజనులు, బహుజనులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసగించేలా బడ్జెట్ ఉన్నది. – జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
6 గ్యారెంటీలకు మంగళమే!
ఈ ఏడాది (2025-26) బడ్జెట్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి…
69 వేల కోట్ల కొత్త రుణం
ఎక్సైజ్ శాఖ నుంచి…50 వేల కోట్లు
బడ్జెట్లో ఆరో వంతు మందుబాబుల దయే!
Budget