నెల్లికుదురు, జూలై 4 : ఇందరమ్మ ఇండ్ల పథకం అర్హులకు అందని ద్రాక్షలా మారింది. వరదల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నరు. వివరాల్లో కేళితే… మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం నిరుడు సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధమైంది. అదే గ్రామానికి చెందిన కోరుకొప్పల నరేశ్ ఇల్లు వరదలకు పూర్తిగా ధ్వంసం కావడంతో ఉండడానికి ఇల్లులేక ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామంలో క్షేత్రస్థాయి సర్వే చేసిన అధికారులు తాను అద్దెకు ఉంటున్న ఇల్లును సొంత ఇల్లుగా తప్పుడు సమాచారం ఇచ్చి తనకు ఇల్లు రాకుండా చేశారని బాధితుడు నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు విస్మరించి తన పేరును ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని వాపోయాడు. అన్ని అర్హతలున్న తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు.