మోటకొండూర్, సెప్టెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఓ కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే… యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన పీట్ల సుశీలరాజు ఇందిరమ్మ ఇల్లు పథకానికి లబ్ధిదారుగా ఎంపికయ్యారు. ఇల్లు మంజూరు కావడంతో అప్పులు చేసి, భార్య తాళి కుదువపెట్టి ఇంటి నిర్మాణం చేపట్టారు. పైకప్పు వేసి, గోడల్ని లేపి కుటుంబంతో ఆనందంగా అడుగు పెట్టాలని కలలుగన్నారు. ప్రభుత్వం మొదటి విడుతగా సుశీలరాజు ఖాతాలో రూ.లక్ష జమ చేసింది. రెండో విడుత నగదు జమకావాల్సి ఉండగా అధికారులు వచ్చి ‘నీకు ఇల్లు రాదు’ అని చెప్పారు. దీంతో తట్టుకోలేకపోయిన రాజు తీవ్ర ఆవేదనతో శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తనను తానే కొట్టుకోవడంతో తలపై తీవ్ర గాయమైంది. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. లబ్ధిదారుల పేరుపై ఎలాంటి ఆస్తి, వస్తువు లేదని చూపించడంతో మొదటి పేమెంట్ వచ్చిందని, లబ్ధిదారులపై ఆరు సంవత్సరాల క్రితం ఒక వాహనం నమోదయిందనే కారణంతోనే పేమెంట్ బ్లాకయిందని తెలిపారు. చాడ గ్రామానికి చెందిన కోత్తోజు కృష్ణకు ఇలాంటి సమస్య రావడంతో తమ పేరుపై ఉన్న వాహనాలను ఇతరులపై నమోదుచేయిచుకుని లబ్ధి పొందారని అధికారులు తెలిపారు.