తిరుమలాయపాలెం, జూన్ 23 : ఇందిరమ్మ కమిటీలు ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడుతూ అనర్హులకు ఇండ్లు మంజూరు చేశాయని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్, సీపీఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పిండిప్రోలు బస్టాండ్ సెంటర్లో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళలతో చర్చించగా తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో షేక్శిలార్సాహెబ్కు వినతిపత్రం సమర్పించారు. పిండిప్రోలులో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, జాబితానుంచి అనర్హులను తొలగించి అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఇల్లియ్యకుండా అన్యాయం చేస్తరా?
నేను కాంగ్రెస్ కార్యకర్తను. దివ్యాంగుడిని. అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నాకు అన్యాయం జరిగింది’ అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేటకు చెందిన జవ్వాజి మధునయ్య వాపోయాడు. ఈ మేరకు ఆయన సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుడినైన తాను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇల్లు మంజూరైనట్టు గతంలో జరిగిన గ్రామసభలో అధికారులు ప్రకటించినట్టు తెలిపాడు. తుది జాబితాలో తన పేరు గల్లంతైందని ఆవేదన వ్యక్తంచేశాడు. పంచాయతీ కార్యదర్శిని అడిగితే అర్హుల జాబితా ఉన్నతాధికారులను పంపామని, వారే మంజూరు చేస్తారని చెప్పి తప్పించుకున్నారని పేర్కొన్నాడు. తనకు ఇంటి స్థలంతోపాటు అన్ని అర్హతలు ఉన్నాయని చెబితే కార్యదర్శికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో తెలిపారు. ఎలాంటి విచారణ జరపకుండానే పలువురికి ఇండ్లు మంజూరు చేయడమే కాకుండా, ఈ నెల 16న నిర్మాణాలకు ముగ్గు పోశారని వివరించారు. ఇదివరకు గృహ నిర్మాణ పథకంలో లబ్ధి పొంది, ఇండ్లు కట్టుకొని అమ్ముకున్నవారికీ అధికారులు ఇండ్లు మంజూరు చేశారని, తానేం పాపం చేశానని మధునయ్య వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.