20 లక్షల ఇండ్లు కట్టిస్తానన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే మాటతప్పింది. ఇందిరమ్మ ఇండ్ల సంఖ్యను 4.5 లక్షలకు కుదించింది. దాంట్లోనూ రోజుకో నిబంధన! 56 గజాలకే అన్నారు. 45 రోజుల్లో నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. దళితబంధు వచ్చి ఉంటే ఇల్లు కట్ అన్నారు. ఇసుక ఉచితమని చెప్పి మాటమార్చారు. ఇప్పుడు స్లాబ్ పూర్తయ్యాక ఇచ్చే రూ.2 లక్షల బిల్లులో రూ.60 వేలు కోతపెట్టారు. ఆ మేరకు ఉపాధి హామీ కింద పనులు చేసుకోవాలని చెప్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కొర్రీలు పెడుతూ లబ్ధిదారులను గోస పుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్ పడ్డాక ఇచ్చే రూ.2 లక్షల్లో రూ.60వేలు కోత పెట్టింది. కోసిన ఆ రూ. 60 వేలకు బదులుగా బాత్రూం, ఇతర పనులను ఉపాధిహామీ పథకం కింద పనులు చేయిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం తొలి నుంచి పేదలతో ఆటలాడుకుంటున్నది. రోజుకో ప్రకటన చేస్తూ వారిని గందరగోళంలోకి నెట్టింది. అది చాలదన్నట్టు ఇప్పుడు రూ.60 వేల కోత కోసి పేదలను నిలువునా ముంచేందుకు రెడీ అయింది. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం తీరు తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉన్నది. అధికారంలోకి రాగానే 20 లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. వచ్చాక నాలుక మడతేసి ఆ సంఖ్యను 4.5 లక్షలకు కుదించింది. ఇక లబ్ధిదారుల ఎంపికలోనూ బోల్డన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయి. అసలైన లబ్ధిదారుల స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అనర్హులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం రోజుకో నిబంధన తెస్తూ పేదలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇంటి నిర్మాణానికి గరిష్టంగా 650 చదరపు అడుగులు ఉండాలని తొలుత నిబంధన పెట్టింది. అంతకంటే ఎక్కువ వైశాల్యంలో ఉంటే నిధులు మంజూరు చేసేది లేదని తెగేసి చెప్పింది. కొన్నిచోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 56 గజాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చారు. దీంతో కొందరు తాము ఉంటున్న పూరి గుడిసెలను కూల్చుకుని ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు.
నిబంధనల ప్రకారం రెండు గదులు, వంటగది, టాయిలెట్ నిర్మించేలా ప్లాన్ చేసుకుని పునాదుల వరకు నిర్మించుకున్నారు. ఫొటో తీసుకుని మొదటి విడత బిల్లు మంజూరు చేయాల్సిన అధికారులు పిల్లర్ టు పిల్లర్ 600 ఎస్ఎఫ్టీ లేదంటూ బిల్లులు నిరాకరించారు. అలాగే, ఇల్లు మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. బేస్మెంట్ పూర్తిచేసిన తర్వాత లక్ష, రూఫ్ లెవల్ వరకు వచ్చాక లక్ష, స్లాబ్ పూర్తిచేసిన తర్వాత రూ. 2 లక్షలు, ఫ్లోరింగ్, రంగుల పనులు పూర్తయ్యాక మిగతా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే, మంజూరైన 45 రోజుల్లోనే నిర్మాణం ప్రారంభించాలన్న నిబంధన పేదలను ఉలికిపాటుకు గురిచేసింది. పునాది వరకు నిర్మించేందుకు రూ. 2 లక్షలు అవుతుంది. పేదలు అంతమొత్తం ఎక్కడి నుంచి తేవాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఈ లోగా సమయం మించిపోవడంతో ఇల్లు రద్దయినట్టు అధికారులు ప్రకటించడంతో నివ్వెరపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించిన తర్వాత అర్హుడు కాదంటూ అధికారులు రద్దు చేసిన ఇండ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. దళితబంధు వస్తే ఇల్లు కట్ అంటూ ఇంకోసారి ప్రకటించారు. ఆధార్‌కార్డు ఆధారంగా వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి మంజూరైన ఇండ్లను కూడా రద్దు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ఓ లబ్ధిదారుడుకు ఇల్లు మంజూరైంది. అయితే, అతడు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లాడని మంజూరైన ఇంటిని రద్దు చేశారు. ఇలా నానా రకాల కొర్రీలతో పేదల సొంతింటి కలను దూరం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే రూ. 5 లక్షల్లో రూ. 60 వేలను తెగ్గోస్తుండటంతో లబ్ధిదారులు విలపిస్తున్నారు.
ఇంటి స్లాబ్ పడ్డాక ఇచ్చే రూ. 2 లక్షల్లో రూ. 60 వేలు కోత పెట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు పూర్తయిన వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లేమో కానీ, ఇప్పటికే తడిసి మోపెడైందని వాపోతున్నారు. అప్పట్లో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారని కానీ ఆ ముచ్చట తీరలేదని, ఆ తర్వాత ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్‌ను రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకు ఉండేదని, ఇప్పుడు ఏకంగా రూ. 8 వేల నుంచి రూ. 9 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఇసుకకే దాదాపు లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చే డబ్బుల్లోనూ రూ. 60 వేలు కోసేస్తే ఎలా అని మండిపడుతున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడే మొత్తం ఇల్లు కట్టి పూర్తిచేసేందుకు మేస్త్రీలతో మాట్లాడుకుంటామని, ఇప్పుడు చివరికి వచ్చాక ఆపేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.