Indiramma Life Insurance Scheme | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్‌కార్డు ఉన్నవారికే వర్తింపజేస్తాం’ ఇదీ గురువారం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ, అసెంబ్లీలో బడ్జెట్లో ఈ పథకం అమలుపై పద్దులో పొందుపర్చిన అంశానికీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు పొంతన లేకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1 కోటీ 15 లక్షల కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక గౌరవం.. అన్ని సౌకర్యాలతోపాటు ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పిస్తుంది.. అని సర్కార్ బడ్జెట్ పద్దులో హామీ ఇచ్చింది. కానీ, కేవలం రేషన్‌కార్డు ఉన్న కుటుంబానికే వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రేషన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన కుటుంబాలకూ కొత్త కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దరఖాస్తు దశలోనే మరెన్నో కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రేషన్‌కార్డును లింకు పెడితే ఆయా కుటుంబాలు ఆ పథకంలో అర్హత కోల్పోతాయి. దీంతో అసలు లక్ష్యం నీరుగారుతుంది.
‘గ్యారెంటీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇదే చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. దీనిపైనా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. రెండున్నరేండ్లు దాటినా, మూడు బడ్జెట్లు పూర్తయినా.. పూర్తిస్థాయిలో ఒక్క గ్యారెంటీని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్‌పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇంకా ఎప్పుడు చేస్తారు? అసలు అమలు చేస్తారా? చేయరా? ఆరు గ్యారెంటీలు అటకెక్కినట్టేనా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెస్తుండటం గమనార్హం.
అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో తమ ప్రభుత్వం రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు ఉంటుందని తెలిపారు. వచ్చే క్యాబినెట్ భేటీలో అజారుద్దీన్, కోదండరామ్‌ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించి గవర్నర్‌కు పంపుతామన్నారు. మూసీ పునరుజ్జీవ పనులు ముందుకే సాగుతాయని స్పష్టం చేశారు. బాధితులకు ఎలా మేలు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు బఫర్ జోన్ కిలోమీటర్ తీసుకోవడం లేదని, కేవలం 50 మీటర్లే తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీఎం.. ఆ కేసు విచారణ కొనసాగుతుందని తెలిపారు. ప్రభాకర్‌రావు నుంచి సమాచారం తీసుకొన్నామని, దీని ఆధారంగా కొంత మంది స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌ట్యాపింగ్ కేసులో క్లీన్చిట్ రాలేదని, చక్రధర్‌గౌడ్ వేసిన కేసులోనే ఆయనకు ఊరట లభించిందని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో విచారణకు ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు.