కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశించినా, ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఎంపిక చేసిన వారిలో మూడో వంతు లబ్దిదారులకు కూడా ఇళ్ళ నిర్మాణాలకు మార్కింగ్ చేయకపోగా, చేసిన వారిలో 20 శాతం కూడా బేస్మెంట్ స్థాయికి చేరకపోవడం ఆందోళనకర పరిణామంగా మారింది. దీంతో, అధికారులు పైలెట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, లబ్దిదారులతో నిర్మాణపనులు మొదలు పెట్టించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
పథకంలో భాగంగా నిలువనీడలేని నిరుపేదల కోసం ముందుగా డబ్బులిచ్చి ఇండ్ల నిర్మాణం చేపడుతామంటూ అనేక సభల్లో పదేపదే నొక్కివక్కానించిన అధికార నేతలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియనే ప్రహసనంగా సాగించారు. ఏడాది అనంతరం మండలానికో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, గ్రామంలోని లబ్దిదారులకు గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో లబ్దిదారులకు మంజూరు పత్రాలు కూడా అందజేశారు. అయితే, వీరిలో అత్యధికమంది సొంతిల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి ప్రదర్శించటం లేదు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఏరోజుకారోజు పెరుగుతున్న నిర్మాణ సామాగ్రి ధరలు, ఇంకోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న వైనం వెరసి లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణాలపై దృష్టి సారించటం లేదని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాలకు చెందిన ఎంపిక చేసిన15 గ్రామాల్లో 2027 మందిని లబ్దిదారులుగా అధికారులు ప్రకటించారు.
వీరందరిని ఇళ్ళు నిర్మించుకోవాలంటూ గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులను బట్టి వీరికి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు కూడా లబ్దిదారుల నుంచి తీసుకున్నారు అయితే, లబ్దిదారుల్లో ఇప్పటివరకు 780 మంది మాత్రమే ఇళ్ళు నిర్మాణాలకు మార్కింగ్ చేసుకోగా, వారిలో 114 మంది మాత్రమే పునాదులు తీసి, బేస్మెంట్ స్థాయికి చేర్చారు. మిగతా వారు ఇంకా పిల్లర్ల గోతులు కూడా తీయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కువ మంది లబ్దిదారులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కావటం, దీనికితోడు వరికోతలు ఇపుడిపుడే ప్రారంభమవుతుండగా హార్వేస్టర్, ఇతర అవసరాలకు చేతిలో ఉండే డబ్బు ఖర్చు చేస్తున్నారు. దీంతో, ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ముడిసరుకులు తెచ్చేందుకు డబ్బులేక వాటిపై దృష్టి సాధించటం లేదని తెలుస్తోంది.
అధికారులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనైనా పనులు ప్రారంభించాల్సిందేనంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో చేతిలో రూపాయి కూడా లేకుండా పనులు ఎలా మొదలు పెట్టేదంటూ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళే తమను లబ్దిదారులు ప్రశ్నిస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణంపై అంతగా పురోగతి కనిపించకపోవటంతో, యంత్రాంగంపై ఉన్నతాధికారులు చిర్రుబుర్రులాడుతుండగా, వీరు కిందిస్థాయి సిబ్బందిపై చిటపటలాడుతున్నట్లు అధికారవర్గాల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం దశలవారీగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుండగా, మొదటి దఫాగా బేస్మెంట్ స్థాయికి చేరుకున్న ఇళ్ళకు రూ. లక్ష అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు లబ్దిదారులకు స్పష్టం చేస్తున్నా, తమ మాటలు పట్టించుకోవటంలేదని పేరు చెప్పడానికి ఇష్టం లేని ఓ అధికారి పేర్కొంటుండటం గమనార్హం.