హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకన కొనసాగుతున్నది. తొలివిడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేకపోయింది. ప్రస్తుతం 388 ఇండ్లు మాత్రమే స్లాబు దశకు చేరాయి. తొలివిడతలో మొత్తం ఇండ్లకు రూ.22,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా కాగా, ఇప్పటివరకు లబ్ధిదారులకు మొత్తంగా రూ.98.64 కోట్లనే విడుదల చేయడంతో పథకంపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, ప్రభుత్వం తొలిదశలో 4.5 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదలు ఇంటి జాగా ఉన్నవారికే ఇండ్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటివరకు 2,03,744 ఇండ్లనే మంజూరుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 388 ఇందిరమ్మ ఇండ్లకు స్లాబ్‌లు వేయగా, 9,877 ఇండ్లకు పునాదులు పూర్తయ్యాయి. మరో 1,839 ఇండ్లకు గోడల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు లక్ష్యంలో ఒకటో వంతు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. స్లాబులు పూర్తయిన ఇండ్లు చిన్నాచితకా పనులు పూర్తిచేసి నివసించేందుకు సిద్ధం కావాలంటే ఇంకా ఎంతలేదన్నా పక్షం రోజులు పడుతుందని అధికారవర్గాలే చెప్తున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణంపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయనేలేదు. మురికివాడల్లో ఇన్-సిటూ పద్ధతిలో ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ హైదరాబాద్‌లోని మురికివాడల్లో అధికారుల సర్వే ఇంకా కొనసాగుతున్నది. అక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకుగాను అధికారులు స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఇండ్లు ఖాళీ చేసేందుకు వెనుకాడుతున్నారు. అసలే నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. అనుకున్న విధంగా గడువులోగా ఇండ్లు పూర్తిచేయకుంటే తాము ఎటూ కాకుండా పోతామని, అద్దెలు చెల్లించే బాధ తప్పదని వారు వాపోతున్నారు.
తొలివిడతలో 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం.. అంతటితో ఆగకుండా 20లక్షల ఇండ్లు నిర్మిస్తామని పలుమా ర్లు ప్రకటనలు చేసింది. ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగినట్టు.. ఎడాదిన్నర కాలంలో మొదటి విడత లక్ష్యంలో ఒక వంతు కూడా పూర్తిచేయని ప్రభుత్వం, 20 లక్షల ఇండ్లను నిర్మించేందుకు ఎన్నేండ్ల సమయం తీసుకుంటుందోనని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతానికి ఇంటి జాగా ఉన్నవారికే ఇండ్లను మంజూరు చేస్తున్న సర్కారు.. లేనివారికి ఎప్పుడు ఇస్తుందో అర్థం కావడమే లేదు. ఇంటి స్థలం లేనివారికి ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చి.. చేపట్టలేదు. దీంతో ప్రభు త్వ తీరుపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
గీసుగొండ, జూన్ 19: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్నగర్కాలనీకి చెందిన దివ్యాంగురాలు లింగంపల్లి నిర్మలకు బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతో స్థానిక నాయకులు ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన నిర్మలను ‘నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో..!, మా ఇండ్ల మీద పడిఎందుకు ఏడుస్తున్నవ్?’ అంటూ ఎమ్మెల్యే అవమానించిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురించింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యేను కలిసి దివ్యాంగురాలికి ఇల్లు ఇవ్వాలని, లేదంటే డివిజన్లో ఇబ్బంది వస్తుందని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే నిర్మలకు ఇళ్లు ఇవ్వాలని ఆదేశించగా, ఇంటి మంజూరు పత్రాన్ని నాయకులు నిర్మలకు అందజేశారు.