Indiramma Indlu | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తామని ఇటీవల మంత్రి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే జిల్లాల్లో ఇప్పటికి 60 శాతం, గ్రేటర్ హైదరాబాద్లో కేవలం 10 శాతం మాత్రమే పూర్తయినట్టు తెలుస్తున్నది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రంలో 80 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చిన విషయం విదితమే. కేంద్రం అమలుచేస్తున్న పీఎంఏవై పథకంతో కలిపి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తుదారుల వివరాలన్నీ పీఎంఏవై యాప్లో నమోదు చేయాల్సి వచ్చిం ది.
దరఖాస్తుదారుల సమగ్ర సమాచారం నమోదు చేస్తేనే సదరు యాప్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు, వారి ఫోటోలను సేకరిస్తున్నారు. జిల్లా ల్లో సైతం ఇప్పటివరకు 60 శాతమే సర్వే పూర్తయింది. సర్వే సిబ్బంది చాలా గ్రామాలకు వెళ్లకపోగా, వెళ్లిన గ్రామాల్లో సైతం డోర్లాక్లు, ఇతరత్రా కారణాలతో వివరాల సేకరణ జరగలేదని సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్ల పరిధిలో 10.71 లక్షలమంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 1.71 లక్షల దరఖాస్తుదారుల వివరాలు మాత్రమే యాప్లో నమోదు చేశారు. సర్వే పూర్తిచేసేందుకు ఇంకా 15 రోజులు పడుతుందని గృహనిర్మాణ సంస్థ ఎండీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికి 4.5 లక్షల ఇండ్ల మంజూరు కష్టంగానే కనిపిస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం మాత్రం ఇంతవరకు కొలిక్కిరాలేదు. 2023 డిసెంబర్ 28 నుంచి గత ఏడాది జనవరి 6వ తేదీవరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. గత ఏడాది మార్చి 11న సీఎం చేతులమీదుగా భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత ప్రక్రియ చేపడతామన్నారు.
దసరాకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఇంతవరకు చాలాచోట్ల ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాలేదు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. అదికూడా అమలుకాలేదు. సెప్టెంబర్లో దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి డిసెంబర్ 5న యాప్ను ఆవిష్కరించారు. గత నవంబర్లో వివరాల సేకరణకు సర్వే చేపట్టగా, ఇప్పటివరకు 60శాతం వరకు సర్వే పూర్తయింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కేంద్ర సహకారంతో లబ్దిదారులకు నాలుగు దశల్లో 5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి అన్ని వివరాలూ సేకరిస్తామని గృహనిర్మాణ సంస్థ ఎండీ ఒక ప్రకటనలో హామీ ఇచ్చారు. తమ ఇండ్లకు అధికారులు రాలేదని ఎవ్వరూ ఆందోళన చెందరాదని ఆయన భరోసా ఇచ్చారు. దరఖాస్తుదారులు ఎక్కడికీ వెళ్లొద్దని, వచ్చే 15 రోజుల్లో అధికారులే మీ ఇంటివద్దకు వస్తారని స్పష్టంచేశారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు సొంతమా? లేక అద్దె ఇల్లా? ఆ ఇంటిని దేనితో నిర్మించారు? తదితర వివరాలు ఫొటో తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తామని ఎండీ వివరించారు.