హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): మిడ్ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టేట్ రిజర్వు కోటా కింద మంజూరు చేసిన ఈ ఇండ్లకు అర్హత నిబంధనలను సడలించారు. లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 గ్రామాల్లో 10,683 కుటుంబాలు ప్ర భావితం అయ్యాయి. వారికి ఇదివరకే ఇంటి పట్టాలు అందించగా, ఇందులో 5987మంది ఇండ్లు నిర్మించుకున్నట్టు ప్రభుత్వానికి కలెక్టర్ తెలిపారు. మిగ తా వారికి ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో సమీకృత డివిజనల్ ఆఫీస్
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 26 కోట్లు మం జూరు చేసింది. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
‘ఇవి ప్రభుత్వ హత్యలే’
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పీడీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, కార్యదర్శి కుమార్, రాష్ట్ర నాయకుడు కోట ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు నిత్య కృత్యమయ్యాయని ఆరోపించారు. ఈఘటనలపై సమగ్ర దర్యా ప్తు జరపాలని డిమాండ్ చేశారు.