కారేపల్లి, మే 4: ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరించారంటూ ఖమ్మం జిల్లా భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్థులు ఆదివారం పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పక్రియను ఇందిరమ్మ కమిటీ బాధ్యులకు అప్పజెప్పడంతో వారు డబ్బులిచ్చిన వారికే ఇండ్లు మంజూరు చేయిస్తున్నారంటూ విమర్శించారు. అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయి తడకలు కట్టుకొని రేకుల నీడలో ఉంటున్న తమకు ఇండ్ల మంజూరులో అన్యాయం జరిగిందంటూ బాగ్యనగర్తండామహిళలు పురుగులమందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ న్యాయం చేయకపోతే పురుగుమందు తాగి చనిపోతామంటూ బానోత్ నందిని, గుగులోత్ సునీత, గుగులోక్ కైకా, బానోత్ కాంతి, గుగులోత్ లలిత, పార్వతి స్పష్టంచేశారు.