ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఏర్పడక ముందు నిర్మించిన ఇందిరాసాగర్.. అంటే 1980లోనే అందుబాటులోకి వచ్చిన నీటి వనరుకు ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎగువన రావిర్యాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసే చెరువుకు అకస్మాత్తుగా ‘రియల్’ ముప్పు వచ్చి పడింది. ఇందిరాసాగర్‌కు వరద నీటిని మోసుకొచ్చే దాదాపు వంద ఫీట్ల వెడల్పుతో ఉండే ఫీడర్ చానెల్‌తోపాటు బఫర్‌జోన్ పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో కుంచించుకుపోతున్నది. ఎత్తయిన గుట్టలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లిన ఇందిరాసాగర్‌కు ఇప్పుడు ఆ గుట్టలే శాపంగా మారాయి. భారీ యంత్రాలతో గుట్టలన్నింటినీ పిండి చేస్తున్న రియల్టర్లు మట్టి, రాళ్లను అందులోకి జార విడుస్తుండటంతో మున్ముందు వరద వచ్చే మార్గమే మూసుకుపోయే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదీ… రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం-అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల సరిహద్దున ‘అసైన్డ్ భూముల్లో వెంచర్’ వ్యవహారంలో కొత్త కోణం. హైడ్రా పరిధిలోనే ఇదంతా జరుగుతున్నా… సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో బహిరంగంగానే ఇందిరాసాగర్‌కు ఉరితాడు బిగుసుకుంటుంది.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నాగన్‌పల్లి.. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని అనాజ్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో ఓ భారీ వెంచర్ రూపుదిద్దుకుంటుందనేది బహిరంగమే. సుమారు 250-300 ఎకరాల (ఇతరుల భూములు కలుపుకున్నా) విస్తీర్ణంలో ఉన్న పట్టా భూముల ఆధారంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఈ భూముల్లోకి రావాలంటే గ్రామాల్లో పూర్వం నుంచి ఉండే చిన్న చిన్న డొంకలు, దారులు ఉన్నాయి. కానీ ఆ భూమిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న దరిమిలా విశాల రహదారులు నిర్మిస్తున్నారు. ఇందుకోసం నాగన్‌పల్లి పరిధిలోని అసైన్డ్ భూములను లీజు ప్రాతిపదికన తీసుకొని అందులో వంద ఫీట్ల రహదారులు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసినా పనులు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆ పనులు మరింత లోతుగా పరిశీలించినపుడు ఇందిరాసాగర్‌కు వాటిల్లుతున్న ముప్పు బయటపడింది. 1981లో రంగారెడ్డి జిల్లా ఏర్పడగా.. అంతకు ఏడాది ముందే ఇందిరాసాగర్ నిర్మాణం పూర్తయింది. మూడు గ్రామాల పరిధిలో 512 ఎకరాల ఆయకట్టుకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందుతుంది. దీంతో పాటు చుట్టుపక్కల గ్రామాల పరిధిలో భూగర్భజలాలూ పెరగడంతో తాగునీరు అం దుతుంది. ఈ చెరువుకు సుదూర ప్రాంతం నుంచి గొలుసుకట్టు ద్వారా వరద నీరు రావడం విశేషం. మహేశ్వరం మండలంలోని రావిర్యాల పెద్ద చెరువు నుంచి ప్రారంభమయ్యే పులిందర్‌వాగు క్రమంగా దిగువన ఉన్న మంగళపల్లి వద్ద చెక్‌డ్యాం.. ఆపై శేరిగూడ వద్ద మరో చెక్‌డ్యాం మీదుగా తట్టిఖాన వద్ద వాగులోని చెక్‌డ్యాంను దాటి ఇందిరాసాగర్‌కు చేరుకుంటుంది. ఇలా సుమారు వంద ఫీట్ల కాల్వ (వాగు) మార్గం ద్వారా భారీ ఎత్తున వరద వస్తుంది. ఇందిరాసాగర్ నుంచి దిగువన అనాజ్‌పూర్ చెరువుకు వరద చేరుకుని… అది మత్తడి దుంకితే దిగువన ఉన్న మూసీలోకి నీరు చేరుతుంది. ఈ క్రమంలో 2015లో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.61 లక్షలతో ఇందిరాసాగర్ అభివృద్ధి, మరమ్మతు పనులను కూడా చేపట్టడంతో అదో పర్యాటక ప్రాంతంగా మారింది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్లు 261, 260-281 వరకు 586 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో పలు సంస్థలకు చెందిన పట్టా భూములతో పాటు ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన సీలింగ్ పట్టా భూములు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 279, 280, 281 సర్వేనెంబర్ల మీదుగానే నాగన్‌పల్లి నుంచి దిగువన ఉన్న అనాజ్‌పూర్ పరిధిలోని ఇందిరాసాగర్‌కు వరద నీరు వెళ్లే మార్గం ఉంది. ఇది సుమారు వంద ఫీట్ల మేర వెడల్పుతో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేవలం ఈ మార్గమే 18.12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నిబంధనల ప్రకారం బఫర్‌జోన్ కూడా ఉంటుంది. అయితే పక్కనే ఉన్న భూములను అభివృద్ధి చేయడంలో భాగంగా గుట్టలన్నింటినీ భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద బండరాళ్లు, భారీ ఎత్తున మట్టిన బఫర్‌జోన్, వరద వెళ్లే మార్గంలో పోస్తున్నారు. ఈ పనులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మున్ముందు ఇంకా అనేక గుట్టలను తవ్వాల్సి ఉండటంతో ఇందిరాసాగర్‌కు ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఈ మార్గం మూసుకుపోతే వందల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడంతో పాటు భూగర్భజలాలకూ నష్టం వాటిల్లుతుంది. దిగువన ఉన్న అనాజ్‌పూర్ చెరువుకు కూడా వరద నీరు వచ్చే మార్గముండదు. వాస్తవానికి నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే స్పందించి ఇందిరాసాగర్, వరద నీరు వచ్చే మార్గం, బఫర్‌జోన్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కాగా అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని పలు సర్వేనెంబర్ల పరిధిలో 586 ఎకరాలు ఉండగా… అందులో సుమారు 146.35 ఎకరాల మేర సీలింగ్ భూములు ఉన్నాయి. అయితే ఇదంతా ఒకేచోట లేదు. పలు సర్వేనెంబర్లలో కొంత, కొంత ఉంది. ఈ నేపథ్యంలో పట్టా భూముల అభివృద్ధిలో భాగంగా సీలింగ్ భూములు ఉన్న గుట్టలను కూడా చదును చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.