నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రారెవరూ సాటి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు, బాధ్యతగా వ్యవహరిస్తారు. అన్నింటికన్నా నేరాల అడ్డుకట్టలో ‘స్మార్ట్’గా పనిచేస్తారు..ఇదీ తెలంగాణ పోలీసుల ఘనత. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే చెప్పిన సత్యాలివీ.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ శాఖ మరో ఘనతను సాధించింది. నేరాల అడ్డుకట్టకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించటంలో టాప్లో నిలిచారు. సామాజిక సేవ, సత్వర స్పందనే కాదు బాధితులకు సేవలు అందించటంలో భేష్ అనిపించుకొన్నారు. ప్రజా సమస్యలపై తక్షణ స్పందనలోనూ నంబర్1గా నిలిచారు. విశ్రాంత ఐపీఎస్లకు సంబంధించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్).. తొలిసారి కన్సాలిడేట్ స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా రాష్ర్టాల పోలీస్ శాఖల పనితీరును వెల్లడించింది. 29 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా పౌరుల అభిప్రాయాలను సేకరించింది. టెక్నాలజీ వినియోగం, బాధితులకు సత్వర సేవలు అందించటం, పోలీసుల ప్రవర్తన తదితర విభాగాల్లో సర్వేను నిర్వహించగా, 1,61,191 మంది పౌరులు అంశాల వారీగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన నివేదికను ఐపీఎఫ్ చైర్మన్ ప్రకాశ్ సింగ్, ప్రెసిడెంట్, ఫౌండర్ ఎన్ రామచంద్రన్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. ఐపీఎఫ్ వెల్లడించిన అన్ని విభాగాల్లో తెలంగాణ టాప్ 3లోనే నిలిచింది.