Dubai | నారాయణపేట/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: నారాయణపేటకు చెందిన ఓ యువకుడు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ ఏజెంట్ చేతిలో మోసపోయాడు. బలవంతంగా రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్ సరిహద్దులో శిక్షణ పొందుతున్నాడు. నారాయణపేట వాసి మహ్మద్ సూఫియాన్ (22) జీవనోపాధి కోసం రెండేండ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడి ఎయిర్పోర్టులో ప్యాకింగ్ విభాగంలో పనిచేస్తున్న సూఫియాన్ను బాబా అనే ఏజెంట్ సంప్రదించాడు. రష్యాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉన్నదని, మంచి జీతం ఇస్తారని నమ్మబలికాడు. సూఫియాన్తోపాటు మన దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన మరికొందరు అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత వారికి సైనిక దుస్తులు ఇచ్చారు.
తమను రష్యా సైన్యంలో చేర్చుకునేందుకు తీసుకెళ్తున్నారని తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు. శిక్షణ పొందుతున్న అటవీప్రాంతం నుంచి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేసి తమ కష్టాలను వివరించారు. విషయం సూఫియాన్ కుటుంబసభ్యులకు తెలవడంతో ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఎలాగైనా సూఫియాన్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. దీనిపై కేంద్రం స్పందించింది. వారిని అక్కడి నుంచి విడిపించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ప్రయత్నిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం వెల్లడించారు.