హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): భారతీయులు, అందునా సామాన్యులు విదేశాలకు వెళ్లి చదవడం, అక్కడ పరిశోధనలు చేయడమంటే మాటలతో అయ్యే పనికాదు. ఒకవేళ అలాంటి అవకాశం లభించినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు సులభంగా లభించనున్నది. జపాన్‌లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఐటీ)లో ప్రొఫెసర్‌గా, బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసి మురళీధర్ మిరియాల ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు.
విద్యార్థుల రాకపోకలకు, జపాన్‌లో ఉండేందుకు అవసరమయ్యే నిధులను సమకూర్చేందుకు కూడా ముందుకొచ్చారు. దీంతో విద్య, పరిశోధన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుందుకు ఎస్ఐటీతో ఓయూ అవగాహనా ఒప్పందాన్ని కుదర్చుకున్నది. ప్రస్తు తం జపాన్‌లో పర్యటిస్తున్న ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్, షిబౌరా సంస్థ అధ్యక్షుడు జన్ యమద శుక్రవారం ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ఓయూ విద్యార్థులకు జపాన్‌లో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వడంతోపాటు ఎస్ఐటీ విద్యార్థులతో సంయుక్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు.