హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు కోర్సు ముగిసిన తర్వాత తమ అనుబంధ దవాఖానల్లో పనిచేయాలని విద్యార్థులతో బాండ్లు రాయించుకోవద్దని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అన్ని రాష్ర్టాల్లోని యూనివర్సిటీల వీసీలు, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్లు, నర్సింగ్ స్కూల్, కాలేజీ ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని ఇన్స్టిట్యూట్లు విద్యార్థులను బెదిరించి బాండ్లు రాయించుకోవడంతోపాటు తమ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఈ ప్రక్రియ ఐఎన్‌సీ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించే ఇన్స్టిట్యూషన్లపై ఐఎన్‌సీ యాక్ట్‌లోని సెక్షన్-14 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.