హైదారబాద్ : ప్రస్తుతం భారతదేశ న్యాయవ్యవస్థ వీరాభిమన్యుడిలా పోరాడుతోందని సీపీఐ నారాయణ అన్నారు. అంతిమంగా ఈ జ్యుడీషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనే విశ్వాసం ఉందని చెప్పారు. ఒకవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషన్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఈసీని, ఈడీని, సీబీఐని గ్రిప్‌లో పెట్టుకొన్నారని విమర్శించారు.
జ్యుడీషియరీ ఒకటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నదని నారాయణ చెప్పారు. నామినేటెడ్ గవర్నర్లుగా నియమించబడిన వారు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నారని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల పాలక ప్రభుత్వాలపై గవర్నర్లు దాడి చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాలని గౌరవించాలని జుడీషియరీ కూడా చెబుతున్నప్పటికీ, అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనటం విచారకరమని అన్నారు.
దేశంలోని ప్రధాన బాడీలలో రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, జ్యుడీషియరీ, నీతి అయోగ్, సీబీఐ ప్రధానమైనవని చెప్పారు. అందులో నాలుగింటిని మోడీ సర్కార్ మింగేసిందని అన్నారు. ఇందులో జ్యుడీషియరీ మాత్రమే మిగిలిందని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం కిందిస్థాయిలో చాలా బలంగా మిగిలి ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజాస్వామ్యాన్ని, జ్యుడీషియరిని కాపాడుకునేందుకు తప్పనిసరిగా పోరాడుతాం’ అని నారాయణ అన్నారు.
సెంట్రల్లో కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉందని, దాన్ని అధిగమించాలంటే దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై సీపీఐ చర్చిస్తున్నదని తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్‌లో జరిగే జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ‘యాంటీ బీజేపీ ఫ్రంట్’ ఏర్పడే దిశగా కృషి చేస్తామని అన్నారు.