Insurance | న్యూఢిల్లీ, మే 19: విదేశాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలిచేందుకు భారతీయ బీమా కంపెనీలు ముందుకు వచ్చాయి. సాధారణం మెడికల్ కవరేజ్‌ని మించి ఈ కొత్త పాలసీలు ఉంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తా కథనంలో తెలిపింది. వీసా రక్షణ, వీసా రద్దు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం పోవడం వంటి ప్రత్యేక పరిస్థితులను ఈ కొత్త పాలసీలు కవర్ చేస్తాయి. కొన్ని పాలసీలు వసతి ఖర్చు, హఠాత్తుగా చదువుకుంటున్న దేశం నుంచి బయల్దేరాల్సిన పరిస్థితి వస్తే తిరుగు ప్రయాణ చార్జీలు వంటివి కవరేజ్ పరిధిలోకి వస్తాయి. ఆతిథ్య దేశంలో మారుతున్న ప్రభుత్వ విధానాలు, ప్రపంచ అస్థిర పరిస్థితుల కారణంగా విద్యార్థులు అవాంతరాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటువంటి అంశాలను కూడా పాలసీలో చేర్చవలసి వస్తోంది. కొత్త పాలసీలకు విదేశీ విద్యార్థుల నుంచి మంచి డిమాండ్ వస్తోందని పాలసీ బజార్‌కు చెందిన ట్రావెల్ ఇన్సూరెన్స్ అధిపతి కపాడియా టీఓఐకి తెలిపారు.
అమెరికా, కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ జర్మనీ, ఐర్లాం డ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని ఆయన చెప్పారు. విద్యార్థులకు భద్రత కల్పించే అంశాలతో కూడిన సమగ్ర భారతీయ బీమా పాలసీల పట్ల విద్యార్థులు మక్కువ చూపుతున్నారని చెప్పారు. అదనపు కవరేజ్ అవకాశాలతో కూడిన స్వదేశీ ఇన్సూరెన్స్ పాలసీవిదేశాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్నట్లు బజాజ్ అలయన్జ్, జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు తెలియచేస్తున్నాయి. ఉద్యోగం కోల్పోవడం, మానసిక కౌన్సెలింగ్, అత్యవసరంగా స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితులను కవర్చేసే సమగ్ర ప్యాకేజీలను చాలామంది విద్యార్థులు కోరుతున్నారని బజాజ్ అలయన్జ్కు చెందిన ఆశిష్ సేఠీ తెలిపారు.