హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త వాటర్ ట్రీట్మెంట్ విధానాన్ని డెవలప్ చేసింది. నీటిలో ఉండే సహజసిద్ధమైన మినరల్స్‌కు నష్టం వాటిల్లకుండా సూక్ష్మ వ్యర్థాలు, హానికర రసాయన సమ్మేళనాలను తొలగించే అధునాతన నానోఫిల్టరేషన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం అవలంబిస్తున్న రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో), ఇతర వాటర్ ట్రీట్మెంట్ పద్ధతుల వల్ల మలినాలతోపాటు మినరల్స్ పరిమాణం కూడా గణనీయంగా తగ్గిపోతుండటంతో ఆ నీటిని తాగినా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ఖనిజ లవణాలకు నష్టం లేకుండా నీటిని శుద్ధి చేసేందుకు అధునాతన నానోఫిల్టరేషన్ విధానాన్ని రూపొందించినట్టు ఐఐసీటీ పరిశోధకులు వెల్లడించారు. సింథటిక్ మెటీరియల్స్‌తో కూడిన ఈ విధానం వల్ల నీటి శుద్ధి ఖర్చుతోపాటు టీడీఎస్ (టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్), వ్యర్థ జలాల పరిమాణం గణనీయంగా తగ్గుతుందని, శరీరానికి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు.