దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్‌నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం అప్పులు రూ.191 లక్షల కోట్లు దాటనున్నది.
BJP | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశ జీడీపీలో ఇప్పటికే సగానికంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీలు, ఇతర మార్గాల నుంచి రికార్డు స్థాయిలో రూ. 14.82 లక్షల కోట్ల రుణాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు
రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరిగి భారీ ద్రవ్యలోటుకు దారితీయడంతో దాన్ని పూడ్చేందుకే కొత్తగా రుణాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. తాజాగా సమీకరించే రూ. 14.82 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీ నుంచి రూ. 11.54 లక్షల కోట్లు ఉంటాయని అంచనా. అలాగే, చిన్న మొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి మరో రూ. 3.28 లక్షల కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.
గత 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ. 55,87,147 కోట్లు కాగా, నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత గడిచిన పదిన్నరేండ్లలో చేసిన అప్పు రూ. 1,35,65,363 కోట్లుగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ. 83 వేల కోట్లు అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రధాని నెలకే రూ. 1.07 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏటా మిత్తీలకే రూ. 12,76, 338 కోట్లను చెల్లించాల్సి వస్తున్నది.