హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలపాలనే లక్ష్యంతో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులశాఖ కార్యదర్శి వీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లో రెండురోజులపాటు నిర్వహించిన 24వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఇందులో ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పౌరులకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేయడంతోపాటు భవిష్యత్తు తరానికి అవసరమైన పరిపాలన సంస్కరణలను రూపొదించటంపై సదస్సులో చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. సదస్సులో తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్బీఎస్ రాజ్‌పుత్, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సదస్సులో ఆరు అంశాలపై చర్చలు జరిగాయి. వివిధ అంశాలపై 50 మందికిపైగా నిపుణులు పత్రాలను సమర్పించగా, దేశం నలుమూలల నుంచి రెండువేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పౌరులను ప్రభుత్వానికి మరింత దగ్గర చేయడం, సామాజిక సాధికారత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్, 5జీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ తదితర సాంకేతికతలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, ఎమర్జింగ్ టెక్నాలజీలపై నైపుణ్యం కలిగిన వనరులను సృష్టించి, దేశాన్ని సాంకేతికతకు గ్లోబల్ హబ్‌గా మార్చడం. ప్రజా ఫిర్యాదులను సజావుగా పరిష్కరించడం కోసం సీపీగ్రామ్తో అన్ని రాష్ర్టాలు, జిల్లా పోర్టర్లను ఏకీకరించడం వంటి అంశాలను హైదరాబాద్ డిక్లరేషన్‌లో ఆమోదించారు.