నిజామాబాద్ క్రైం, నవంబర్ 19: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కన్నయ్యగౌడ్ (35) సైబర్ మోసగాళ్ల వేధింపులతో శనివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ ఎస్సై బీ సంజీవ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని సాయినగర్‌లో నివాసం ఉండే కన్నయ్య శనివారం రాత్రి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నయ్యకు సైబర్ మోసగాళ్లు న్యూడ్ కాల్ చేసి వేధింపులకు గురిచేశారు. కన్న య్య ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆయన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. మనస్తాపం చెందిన కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుడి బావమరిది కే ప్రకాశ్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంజీవ్ వెల్లడించారు.