స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటనున్నాయి. ప్రతి ఇల్లు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నది. దేశ స్వాతంత్రోద్యమంపై స్కూళ్లు, సినిమా హాళ్లలో చలన చిత్రోత్సవాలు.. పాటల పోటీలు, నాటక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు హోరెత్తనున్నాయి.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను 15 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆగస్టు 8 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బుధవారం బీఆర్కేభవన్లో కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించి తీసుకొన్న నిర్ణయాలను మీడియాకు కేకే వెల్లడించారు. వజ్రోత్సవాలను ఆగస్టు 8న హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని చెప్పారు. ముగింపు ఉత్సవాలు 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో పోలీస్ బ్యాండ్, ఇతర కళారూపాల ప్రదర్శన ఉంటుందని అన్నారు.
హైదరాబాద్ నగరం మొత్తం అలంకరిస్తామని, స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలను, హోర్డింగులను ప్రదర్శిస్తామని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న జాతీయ నేతల చరిత్రను తెలిపేలా 15 రోజుల పాటు ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని, పాఠశాలలు, సినిమాహాళ్లలో ఈ చిత్రాలను ప్రదర్శిస్తామని వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమంపై అవగాహన కలిగించేలా స్కూళ్లలో వ్యాసరచన, పాటల పోటీలు, నాటక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకు ఆటల పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు జిల్లాస్థాయిలో అథారిటీగా కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో అథారిటీగా తమ కమిటీ ఉంటుందని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని చెప్పారు.
దీపాంజలి కార్యక్రమం, అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ, ట్రాఫిక్ సిగ్నళ్లలో జనగణమన ఆలాపన ఉంటాయని కేకే తెలిపారు. ఏ రోజు, ఏ కార్యక్రమం చేయాలనేది మరో సమావేశంలో నిర్ణయిస్తామని వివరించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ముగింపు ఉత్సవాలకు ప్రతి జిల్లా నుంచి వెయ్యి నుంచి 2 వేల మందిని తీసుకొచ్చి ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత పౌరుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారని అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ప్రభాకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్కే భవన్లోమీడియాతో మాట్లాడుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, మంత్రి తలసాని,
ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్
ఉపరాష్ట్రపతి ఎన్నికపై త్వరలో టీఆర్ఎస్ నిర్ణయం: కేకే
ఉపరాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ఎస్ నిర్ణయాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. బుధవారం బీఆర్కేభవన్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనడమా? తటస్తంగా ఉండటమా? అనేదానిపై తమ నిర్ణయం ఉంటుందని అన్నారు. తాము ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నామని పేర్కొన్నారు.