హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమం చేపడుతాం. ఒకరోజు 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం’ అని ఫెడరేషన్ ఆఫ్ అసో సియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) చైర్మన్ రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఫతి జనరల్ బాడీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఫతి చైర్మన్ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ అసోసియేషన్ నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం హామీనిచ్చినట్టుగానే తొలుత రూ.900 కోట్ల ఫీజు బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నవంబర్ 3 నుంచి కాలేజీలను నిరవధికంగా బంద్ పాటిస్తామని స్పష్టంచేశారు. ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోమని తేల్చిచెప్పారు.
తాము ఇండ్లల్లో కూర్చోబోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. 3 నుంచి 10వ తేదీ వరకు రోజుకో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఆ మధ్యన ఒకరోజు 2 లక్షల మంది అధ్యాపకులతో ఆందోళన చేపడుతామని, మరోరోజు 10 లక్షల మందితో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడుతామని వివరించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పరీక్షలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. మిగతా రూ.9వేల కోట్లను 2026 మార్చి 31లోపే విడుదల చేయాలని, ఆ మేరకు రోడ్‌మ్యాప్, క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్యాలెండర్‌ను జీవో రూపంలో విడుదల చేయాలని కోరారు. 2025-26 బకాయిలను సైతం సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ కాలేజీల బకాయిలను సైతం నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని కోరారు. ‘నాలుగైదు నెలలుగా మేమంతా ఉద్యమిస్తున్నాం. రూ.300 కోట్లే ఇచ్చి మొత్తం ఇచ్చామని దాటవేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు మాకు సహకరించడం లేదని, కొందరు అధికారులు మంత్రులను తప్పుదారిపట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని, ఈ విషయాన్ని పరిశీలించి కాలేజీలను ఆదుకోవాలి’ అని కోరారు.
ప్రత్యక్ష్య పోరుతోపాటు సోషల్ వార్‌కు దిగాలని ఫతి నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మాట్లాడిన ప్రసంగాల వీడియోలను అక్టోబర్ 31లోగా సోషల్ మీడియా ద్వారా విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా ఒత్తిడి తేవాలని భావించింది. విజిలెన్స్ తనిఖీలపైనా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి. బకాయిలు అడిగితే సర్కార్‌కు తనిఖీలు గుర్తుకొస్తున్నాయని, ఎన్ని బెదిరింపులొచ్చినా వెనక్కి తగ్గబోమని, త్యాగాలకూ వెనుకాడమని యాజమాన్యాలు ప్రకటించాయి. ఈసారి పోలీసులతో భయబ్రాంతులకు గురిచేస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి.