హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ‘అపాయింటెడ్ డేట్’ను ప్రకటించాలని కోరుతూ ఈ నెల 24న ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్
(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ వెల్లడించారు. బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బస్‌భవన్ ముందు ‘ఆమరణ నిరాహార దీక్ష’కు కూర్చుంటానని తెలిపారు. ఇది తన ఒకడి ఆమరణ దీక్ష కాదని, 39 వేల మంది ఆర్టీసీ కుటుంబాల ఆమరణ నిరాహార దీక్షగా భావించాలని విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నేతలకు కార్మికుల పక్షాన బహిరంగ లేఖ రాశారు. తన దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ‘39 వేల ఆర్టీసీ కుటుంబాల గుండెకోత ఇదీ..’ అంటూ హనుమంతు ముదిరాజ్ తన లేఖను మొదలుపెట్టారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనమైతేనే వారి బతుకులు బాగుపడుతాయని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు, 900 రోజులు గడిచిపోయాయని, వందల మంది కార్మికులు విలీనం ఫలాలు అందకుండానే రిటైరయ్యారని హనుమంతు ఆవేదన వ్యక్తంచేశారు. కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘అపాయింటెడ్ డేట్’ను మాత్రం ఈ ప్రభుత్వం ప్రకటించలేదని విమర్శించారు. ‘ఇంకా ఎంతకాలం ఈ సంకెళ్లు? ఆ ఒక అడుగు వేయడానికి అడ్డుపడుతున్నది ఎవరు? ఆ ఒక తేదీ ప్రకటించడానికి ఎందుకీ తాత్సారం?’ అని ప్రశ్నించారు.
ఎన్నికలు వద్దు.. ముందు విలీనం ‘అపాయింటెడ్ డేట్’ ప్రకటించాలని కార్మికులు రాతపూర్వకంగా వేడుకొన్నా, ప్రభుత్వం ఎన్నికల వైపే పరుగెడుతున్నదని మండిపడ్డారు. తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధంకావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అమరుడు శంకరన్న ప్రాణ త్యాగం వృథా కారాదని పేర్కొన్నారు.