హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల (Private Colleges) యాజమాన్యాలు పోరుబాట పట్టనున్నాయి. ఇప్పటికే సర్కారుపై జంగ్‌సైరన్ మొగించాయి. దీనిలో భాగంగా సోమవారం నుంచి కాలేజీల నిరవధిక బంద్‌ను తలపెట్టాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం మీడియా సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 10న లేదా 11 తేదీల్లో 10 లక్షల మంది విద్యార్థులతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంతో భారీ నిరసన సభను నిర్వహిస్తామని వెల్లడించింది.
అంతకు ముందే ఈ నెల 6న రెండు లక్షల మంది అధ్యాపకులతో హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహిస్తామని ఫతి ప్రతినిధులు తెలిపారు. ఆదివారంలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో నిరవధిక బంద్ పాటిస్తామని ఈ సందర్భంగా ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు వెల్లడించారు. ఆ తర్వాత అధ్యాపకులు, విద్యార్థులతో చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ఇండ్ల ముట్టడితో నిరసనలు వ్యక్తంచేస్తామని తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి చేపడుతామని చెప్పారు. మీడియా సమావేశంలో ఫతి ప్రతినిధులు అల్జాపూర్ శ్రీనివాస్, కొడాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
లంచం తీసుకుని కొన్ని కాలేజీలకే ఇచ్చారా?
తాము బకాయిలు విడుదల కోసం గత 6 నెలలుగా పోరాడుతున్నామని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని రమేశ్‌బాబు తెలిపారు. ఒకటి, రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారని ఆయన ప్రశ్నించారు. 10 శాతం లంచం తీసుకుని విడుదల చేశారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయా కాలేజీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అత్యంత అవినీతి జరిగే సంస్థల్లో విచారణ జరపాలని, చదువు నేర్పే విద్యాసంస్థలపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. కాలేజీల బంద్ సందర్భంగా పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులే స్వచ్చందంగా విధులకు హాజరుకాబోమంటూ తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని తాము దేవుడిని వేడుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఇప్పటికైనా బకాయిలను విడుదల చేయాలని కోరారు.
విజిలెన్స్ పేరిట భయబ్రాంతులేల?
విజిలెన్స్ దాడుల పేరిట సర్కారు భయబ్రాంతులకు గురిచేస్తున్నదని ఫతి ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ ఆరోపించారు. తమను బెదిరించేందుకే విజిలెన్స్ విచారణల పేరిట సర్కారు జీవోను విడుదల చేసిందని మండిపడ్డారు. విజిలెన్స్ విచారణ అంటే కాలేజీలను బ్లాక్ మెయిల్ చేయడమేనని, బకాయిలు అడిగినందుకు బెదిరింపులా? అంటూ ప్రశ్నించారు. విజిలెన్స్ తనిఖీలు చేసినా, భయబ్రాంతులకు గురిచేసినా తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. బకాయిల చెల్లింపు బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తీసుకోవాలని, విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలే పడిపోయాయని, కాలేజీ యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే యోచనను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.