హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): విద్యార్థి, ప్రజా, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో ఎట్టేకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లలో దాదాపు 8లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సంబంధించిన మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపు అనేది మూడేళ్లకు ఒకసారిగా మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించడం పరిపాటి. తెలంగాణలో 2017లో రేట్లను సవరించారు. ఆ తరువాత 2023లో బీఆర్ఎస్ హయాంలో మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 25శాతం మేరకు రేట్లను పెంచాలని నిర్ణయించారు. ఉత్తర్వులు వెలువడేలోగానే ఎన్నికలు రావడంతో అది వాయిదా పడింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చార్జీల పెంపుపై శీతకన్నువేసింది.
చార్జీలను పెంచకపోవడంతో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. అనేక చోట్ల హాస్టళ్లలో ఆహారకల్తీ సంఘటనలు జరిగి వందలాది మంది విద్యార్థులు దవాఖానల పాలయ్యారు. దీనిపై ప్రజాసంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీంతో కాలేజీ హాస్టళ్ల విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1500 నుంచి రూ.2100, గురుకుల హాస్టళ్లలో 3-7వ తరగతి విద్యార్థుల మెస్చార్జీలను రూ.900 నుంచి రూ.1330, 8-10వ తరగతి విద్యార్థులకు రూ. 1100 నుంచి రూ.1540కు పెంచింది. అదే విధంగా 3-7వ తరగతి బాలురకు చెల్లిస్తున్న కాస్మెటిక్ చార్జీలను 55నుంచి రూ.150, బాలికలకు రూ.175, 8-10వ తరగతి బాలురకు సంబంధించి రూ.62 నుంచి 200, బాలికలకు 75నుంచి 275కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మెటిక్ చార్జీల పెంపును ప్రజా, కుల, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, టిగారియా నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, తెలంగాణ గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ బాలరాజు, కే యాదయ్య, పీ రుషికేశ్ కుమార్, ఎం వెంకటేశ్వర్లు, కేవీ చలపతి, డీ బాలస్వామి, అవుల సైదులు, ఎస్ ఝాన్సీరాణి, డాక్టర్ టీ సాంబలక్ష్మి, జానీమియా, శ్రీనివాస్ వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు.