హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్నప్పటికీ మెరుగైన పనితీరుతో ఆకట్టుకొంటున్నారు. దీంతో ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఐటీ కంపెనీలు చెప్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ఎక్కడా ఉద్యోగులను తొలగించిన (ఫైర్) దాఖలాలే లేవని, వాస్తవానికి వర్క్ ఫ్రం హోం విధానంతో ఉద్యోగావకాశాలు మరింత పెరిగాయని ఇటీవల హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఫ్యూచర్ వర్క్ మోడల్స్ సర్వేలో పలు ఐటీ కంపెనీలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీలకు బ్రిటన్, అమెరికా లాంటి దేశాల నుంచే అధికంగా ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు వస్తుంటాయి. కరోనా కాలంలోనూ ఈ ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగలేదని, వర్క్ ఫ్రం హోం పద్ధతిలో కూడా ఉద్యోగులు యథావిధిగానే విధులు నిర్వర్తిస్తున్నారని, వారి పనితీరులో ఎలాంటి మార్పు లేదని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ వివరించారు.
పెరిగిన ఉద్యోగావకాశాలు, ప్యాకేజీలు
ఈ ఏడాదిన్నర కాలంలో ఐటీ ఉద్యోగావకాశాలు, వేతనాలు బాగా పెరిగాయి. 10-15 ఏండ్ల అనుభవమున్న ఉద్యోగులకు దాదాపు రూ.25 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. ఇలాంటి వారు మరో కంపెనీలోకి మారితే రూ.30 లక్షల వరకు వార్షిక వేతనం లభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యమున్న ఉద్యోగులను కాపాడుకోవడంపై ఐటీ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు కొత్త ఉద్యోగుల నియామకాలకూ ప్రాధాన్యమిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే దాదాపు 60 వేలమంది ఉద్యోగులను కలిగి ఉన్న టీసీఎస్ కంపెనీ ఇటీవల మరికొన్ని వేలమందిని నియమించుకునేందుకు చర్యలు చేపట్టింది. పలు ఇతర ఐటీ కంపెనీలు ఇదే బాటలో పయనిస్తూ కొత్త నియామకాలకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలతోపాటు చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలన్నీ కలిపి 1,500 వరకు ఉన్నాయి. ఏడాది క్రితం వీటిలో 5.30 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 6.20 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల చాలా రంగాలు డిజిటలైజేషన్, ఆటోమేషన్ వైపు అడుగులు వేయడంతో ఐటీ కంపెనీలకు గతంలో కంటే ఎక్కువగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో గత ఏడాదిన్నర కాలంగా ఐటీ ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి.
అన్నీ అనుకూలతలే
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎక్కువ సమయం కంపెనీలకే..
కరోనా వల్ల ఐటీ కంపెనీలు 3-4 నెలలపాటు ఇబ్బందులు పడ్డా ఆ తర్వాత పూర్తిస్థాయిలో కోలుకొని మెరుగైన ఉత్పాదకతను నమోదు చేస్తున్నాయి. ఇండ్ల నుంచి కూడా ఉద్యోగులు మెరుగ్గా పనిచేయడమే ఇందుకు కారణం. వాస్తవానికి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగులు ఎక్కువ సమయాన్ని కంపెనీలకే వెచ్చించారు.