హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలో ఉపాధికల్పన చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకొన్నట్టు ఆర్బీఐ నెలవారీ నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ రేటు కొవిడ్ ముందు కంటే పెరిగినట్టు వెల్లడించింది. చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ కల్పన రేటు కోవిడ్ మహమ్మారి కాలం ముందు కంటే తకువగా ఉన్నదని, ఈ రాష్ర్టాల్లో మాత్రమే పెరిగిందని పేర్కొన్నది.
దేశ నిరుద్యోగ రేటు పైపైకి
2019 ఏప్రిల్ తో పోలిస్తే 2022 ఏప్రిల్ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 7.6 శాతం నుండి 7.8 శాతానికి పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఉపాధి పొందిన కార్మికుల సంఖ్య 12.2 మిలియన్లు పెరిగింది. కార్మికశక్తి భాగస్వామ్యం (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్) కూడా గత మార్చిలో 39.5 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 40.2 శాతానికి పెరిగింది. ఇది మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్నది. ఉపాధి కల్పనరేటు కూడా ఒక నెలలో 36.5 శాతం నుండి 37.1 శాతానికి మెరుగుపడిందని ఆర్బీఐ వెల్లడించింది.