Telangana | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో చలిపంజా విసురుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
నిర్మల్ జిల్లా తాండ్రలో 6.6, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 6.7, సంగారెడ్డి 6.8, కామారెడ్డి 7.6, నిజామాబాద్ 7.7, మెదక్ 8, జగిత్యాల 8, వికారాబాద్ 8.2, రాజన్నసిరిసిల్ల 8.6, సిద్దిపేట 8.6, రంగారెడ్డి 8.9, పెద్దపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్‌కు తకువగా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.