గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:33

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు సరికాదు

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు సరికాదు

  • విస్తరిస్తే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం ఏడారే
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కొంత భాగం ఏడారిగా మారడం ఖాయమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవించి ఉన్నంత వరకు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగదని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు జరుగనివ్వరన్నారు. ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. శనివారం శాసనమండలి కమిటీ హాల్‌లో వైస్‌చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌తో కలిసి గుత్తా మాట్లాడుతూ.. 2004లో పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్న సమయంలో తాను కాంగ్రెస్‌లో ఉన్నా పనులను వ్యతిరేకించానని గుర్తుచేశారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించాలనే నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించానని తెలిపారు. 

44 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో గతంలో పోతిరెడ్డిపాడు నిర్మించినప్పుడు ప్రస్తుత నల్లగొండ, భువనగిరి ఎంపీలు ఆనాడు వ్యతిరేకించలేదని, కనీసం నోరు విప్పలేదన్నారు. ఆనాడే వ్యతిరేకించి ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చేది కాదని చెప్పారు. ఆనాడు మాట్లాడని వారు నేడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు పనుల్లో కొందరు కాంట్రాక్టులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ 44 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోతే.. ఆయన కొడుకు జగన్‌ 80 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకుపోవాలని చూస్తున్నారని, ఇది అత్యాశేనని ఆక్షేపించారు. హంద్రీనీవాకు నీళ్లు తీసుకుపోతుంటే మంగళహారతులు పట్టిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకురాలు కూడా పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. 


logo